ఒంటరి ‘గస్తీ’ వొద్దు..!
‘మహిళా మార్షల్స్’ విధులపై ఉన్నతాధికారుల ఆదేశాలు
ఇతర బాధ్యతలు అప్పగించవద్దని హుకుం
సాక్షి, ముంబై: మహిళల రక్షణ కోసం నగరంలో ఏర్పాటుచేసిన మహిళా బీట్ మార్షల్స్ వ్యవస్థను అధికారులు నీరుగారుస్తున్నారు. బీట్ మార్షల్స్‌ను గస్తీ కోసం కాకుండా ఇతర పనులు అప్పగిస్తున్నారు. దీంతో గస్తీ సమయంలో ఒక్కొక్కరే బండిపై వెళ్లాల్సి వస్తోంది. దీంతో అసలు ఉద్దేశమే దెబ్బతినే అవకాశం ఉందని గుర్తించిన ఉన్నతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో మహిళ బీట్ మార్షల్స్‌ను ద్విచక్ర వాహనంపై ఒంటరిగా పంపించవద్దని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అంతేగాకుండా వారికి గస్తీ మినహా ఇతర బాధ్యతలు అప్పగించరాదని అన్ని పోలీసు స్టేషన్ల ఇన్స్పెక్టర్లను ఆదేశించారు.
నగరంలో ఈవ్‌టీజింగ్, రోడ్‌సైడ్ రోమియోలు, ఆకతాయిల ఆగడాలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కాలిబాటన వెళ్లే యువతులకు, మహిళలకు భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ముంబై పోలీసు శాఖలో శిక్షణ పొందిన 200 మందికి పైగా మహిళ బీట్ మార్షల్స్‌ను రంగంలోకి దింపారు. నగరంలోని ప్రతీ పోలీస్ స్టేషన్లో ఇద్దరు మహిళ బీట్ మార్షల్స్‌ను నియమించారు. వీరికి ఒక బైక్, రివాల్వర్, వాకీటాకీ ఇచ్చారు. గస్తీ నిర్వహించే సమయంలో ఇద్దరిలో ఒకరు బైక్ నడుపుతారు. వెనక కూర్చున్న వారి చేతిలో వాకీటాకీ, రివాల్వర్ ఉంటుంది. వీరు తమ పోలీసు స్టేషన్ హద్దులో రోడ్లపై తిరుగుతూ ఉంటారు.
కాని అనేక సందర్భాలలో ఇద్దరిలో ఒకరికి ఇతర బాధ్యతలు అప్పగిస్తున్నారు. గస్తీ నిర్వహించేందుకు బైక్‌పై ఒక్కరినే పంపిస్తున్నారు. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు ప్రధాన కార్యాలయ వర్గాలు ఇద్దరిని తప్పకుండా పంపించాల్సిందేనని ఆదేశించారు. ‘అత్యవసర సమయంలో నిందితులను బైక్‌పై వెంబడిస్తూ వాకీటాకీలో మాట్లాడటం కష్టం.. దీంతో సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్‌కు లేదా జంక్షన్ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి సమాచారం చేరవేసేందుకు అవకాశం ఉండదు. దాన్ని ఆసరాగా చేసుకుని నిందితులు తప్పించుకుని పారిపోయే ప్రమాదం ఉంది. దీంతో వాకీటాకీ, రివాల్వర్ ఉన్న మరో మార్షల్స్‌ను తప్పనిసరి వెంట పంపించాల్సిందే..’నని ఇన్స్పెక్టర్లందరికి ఆదేశాలు జారీచేశారు.
ఈ బీట్ మార్షల్స్ బైక్‌లను పోలీసు స్టేషన్ ఆవరణలో పార్కింగ్ చేసే సౌకర్యం కల్పించాలని, రాత్రులందు ఈ ైబైక్లను సొంత పనులకుగాని, అధికారిక పనులకుగాని పురుష సిబ్బంది వాడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. కచ్చితంగా లాగ్ బుక్ మెంటైన్ చేయాలని, విధులు పూర్తయిన తర్వాత రివాల్వర్, వాకీటాకీ, బైక్ తాళాలు, లాగ్ బుక్ భద్రపర్చుకునేందుకు పోలీసు స్టేషన్లో ప్రత్యేకంగా ఓ లాకర్ సమకూర్చాలని సంబంధిత పోలీసు స్టేషన్లకు హుకుం జారీచేశారు.