అధిక ధరలకు మద్యం విక్రయిస్తే ఖబడ్దార్
అనంతపురం క్రైం :
‘వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోనే ఎక్కువగా కూలీనాలీ చేసుకునే వారున్నారు. వారు సంపాదించిన సొమ్మంతా తాగుడుకే తగలబెడుతున్నారంటూ ప్రతి రోజూ మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. మీరేమో అక్రమంగా సంపాదించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ పేదల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇలాగైతే కుదరదు. కచ్చితంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అమ్మకాలు జరపాలి.
అలా కాదని అధిక ధరలకు విక్రయిస్తే తాట తీస్తాన’ని వన్ టౌన్ సీఐ గోరంట్ల మాధవ్ హెచ్చరించారు. సోమవారం స్టేషన్ పరిధిలోని బ్రాందీ షాపుల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్ఐలు విశ్వనాథ్చౌదరి, జాకీర్హుసేన్ పలు సూచనలు చేశారు. లెసైన్సుదారులు నిబంధనలకు లోబడి మద్యం అమ్మకాలు జరిపితే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఇష్టానుసారం వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. లూజుగా మద్యం అమ్మకూడదని, నిర్ణీత వేళలు కచ్చితంగా పాటించాలని, షాపుల ముందు వాహనాలు పార్కింగ్ చేయరాదని ఆదేశించారు.
షాపుల వద్ద తాగుబోతులు ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. బార్లు, బ్రాందీ షాపులకు తేడా లేకుండా పోతోందని, బ్రాందీ షాపుల పక్కన సిటింగ్కు టేబుళ్లు ఏర్పాటు చికెన్, ఇతర తినుబండారాలు విక్రయించడాన్ని సీఐ పూర్తిగా తప్పుబట్టారు. కొందరు నేరగాళ్లకు నేరాలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించేందుకు బ్రాందీ షాపులు అడ్డాగా మారాయన్నారు. కూలీనాలీ చేసుకునే వారిని రాచి రంపాన పెట్టొద్దని సూచించారు.
తాము చట్టానికి లోబడే పని చేస్తామని, ప్రజల పక్షాన నిలబడే విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ప్రతి షాపు ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వివిధ మద్యం ధరలను సూచించే డిస్ ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని, అలాగే పోలీసుల నంబర్లనూ డిస్ ప్లే చేయాలని ఆయన సూచించారు. రెండుసార్లు కేసుల నమోదైతే మూడోసారి లెసైన్సు రద్దుకు అటు కలెక్టరుకు, ఇటు ఎక్సైజ్ అధికారులకు సిఫార్సు చేస్తామని హెచ్చరించారు.