అంతరంగాన్ని సూటిగా స్పృశించేదే గజల్
తొలి తెలుగు మహిళా గజల్ గాయకురాలు జ్యోతిర్మయి మళ్ళ
రాజమండ్రి కల్చరల్ :సున్నిత భావాలను అందిస్తూ, అంతరంగాన్ని సూటిగా స్పృశించే శక్తి గజల్‌కు మాత్రమే ఉందని తొలి తెలుగు మహిళా గజల్ గాయకురాలు, గజల్ రచయిత్రి జ్యోతిర్మయి మళ్ళ అన్నారు. ‘గజల్ సంధ్య’ కార్యక్రమంలో పాల్గొనడానికి శనివారం నగరానికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
1965లో విశాఖలో జన్మించాను. బీఎస్సీ గణితం, ఎంఏ (హిందీ)ల్లో ఉత్తీర్ణురాలినయ్యాను. గృహిణిగానే జీవితం గడుపుతున్నా. చెన్నైలో ఆకాశవాణి లలిత గీతాలకు బీ గ్రేడ్ కళాకారిణిగా ఉన్నాను. పర్షియన్ భాష నుంచి ఉర్దూ భాషకు, అలా మనకూ గజల్ వచ్చింది. ప్రజాకవి దాశరథి గజల్ సాహిత్యంతో ప్రభావితులయ్యారు. తెలుగులో ప్రయోగాలు చేసి, నలుగురికీ వినిపించేవారు. సినారె కూడా గజల్‌పై ఎన్నో రచనలు చేశారు. గజల్ శ్రీనివాస్ ఎక్కువగా సినారె రచనలే పాడేవారు. సినారెకు సంగీత పరిజ్ఞానం కూడా ఉంది. తాను రాసిన గజళ్ళను ఆయన పాడేవారు. ఇప్పుడు కొత్తపేటకు చెందిన రెంటాల శ్రీవెంకటేశ్వరరావు, పెన్నా శివరామకృష్ణ, ఇలా అనేకమంది గజళ్లపై దృష్టి సారిస్తున్నారు. ముంబాయిలో పీనాజ్ మసాని ఉర్దూలో చేసిన గజల్ గానం విన్నాను.
ఇది అమితంగా ఆకట్టుకుంది. సుమారు ఏడేళ్ల కిందట గజల్ శ్రీనివాస్ గానం చేసిన సినారె గజల్ నన్ను ఎంతో భావోద్వేగానికి గురి చేసింది. ‘అమ్మ ఒకవైపు, దేవతలంతా ఒకవైపు’ అన్న కవిత ప్రేరణనిచ్చింది. నేను శాస్త్రీయ, సంప్రదాయబద్ధమైన గజళ్ళను గానం చేయాలనుకున్నాను. వీటికోసం, నేను కలాన్ని పట్టాను. అలా, నా అవసరాలు నన్ను గజల్ రచయిత్రిగా మార్చాయి. ఇప్పటివరకూ సుమారు 15 కార్యక్రమాలు ఇచ్చాను. సినారె గజల్ లహరి 2014 డిసెంబరులో హైదరాబాదులో, ఆయన సమక్షంలోనే చేయడం నా అదృష్టం. ‘ఇందరు మనుషులు దేవతలైతే, ఎందుకు వేరే కోవెలలు.. ఇన్ని మనుసులు గీతికలైతే, ఎందుకు వేరే కోయిలలు’ అన్న సినారె గజల్ నాడు అందరినీ అలరించింది.
కార్యక్రమం అయ్యాక, ‘నా గజల్స్‌కు జ్యోతిర్మయి పునర్జీవితాన్ని ఇచ్చింద’ని ఆయన నన్ను అభినందించారు. ‘నీకోసమే జన్మంతా, గడపలేదా ఆడది.. నీతోడిదె లోకమంటూ నడవలేదా ఆడది’ అన్న నా గజల్ విమర్శకులను ఆకుట్టకుంది. అలాగే ‘నిన్ను విడిచి నిమిషమైన నిలవడం కష్టం, నీవు లేని కాలాన్నిక గడపడమే కష్టం’ అన్న గజల్ కూడా అందరి ప్రశంసలు పొందింది. గజల్ ప్రక్రియలో సంగీత, సాహిత్యాలు రెంటికీ సమ ప్రాధాన్యం ఉంది. శాస్త్రీయ గజల్‌ను అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలన్నదే నా లక్ష్యం.