విదేశీ గడ్డపై ‘ఉట్టి’
సాక్షి, ముంబై : నగరంలో మహిళా దహిహండీ బృందాలకు మొట్టమొదటిసారిగా విదేశాల్లో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశం దక్కింది. మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంటీడీసీ) న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో దివాలి సంబరాల పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనుంది. ఈ నెల 20వ తేదీన మహిళలతో నిర్వహించే దహి హండీ హైలెట్ కానుందని అధికారి ఒకరు ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో టైమ్స్‌స్క్వేర్‌లో పురుష దహిహండీ బృందాలు ప్రదర్శన నిర్వహించాయి.
అయితే మహిళా గోవింద బృందాలు అక్కడ ప్రదర్శన ఇవ్వడం ఇదే మొదటిసారి. 20 మంది సభ్యులు గల గోవిందా బృందంలో 18 మంది మహిళా గోవిందులు కాగా, ఇద్దరు సమన్వయకర్తలు ఉంటారు. దహిహండీ సమన్వయ్ సమితి (ఎంటీడీసీ) సభ్యులు వివిధ దహిహండీ బృందాల నుంచి జట్టు సభ్యులను ఎంపిక చేయనున్నారు. రాష్ట్ర పర్యాటక విభాగం ఈ బృందం కోసం వీసాతోపాటు వసతి, భోజన సదుపాయాలను స్పాన్సర్ చేయనుంది. బృందం సభ్యులు మాత్రం తమ టికెట్ కోసం రూ.75 వేల ఖర్చును సొంతంగా భరించాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా బృందం సమన్వయకర్త గీతా జగాడే (32) మాట్లాడుతూ.. విదేశాలలో తాము ప్రదర్శన ఇవ్వబోతుండటం ఆనందంగా ఉందన్నారు. అయితే తమకు సహాయ సహకారాలు అందించేందుకు ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ ముందుకు రాలేదన్నారు. కనీసం దహి హండీ నిర్వాహక మండళ్లు నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. తమ బృందం న్యూయార్క్ వెళ్లాలంటే సుమారు రూ.10 లక్షలు అవసరం ఉంటాయని ఆమె తెలిపారు.
దహిహండీ సమన్వయ సమితి అధ్యక్షుడు బాలా పదాల్కర్ మాట్లాడుతూ బృందం అక్కడికి వెళ్లేందుకయ్యే ఖర్చును ఎవరైనా స్పాన్సర్ చేస్తే బాగుంటుందని తాము ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలను, రాజకీయ నాయకులను కలిశామని కాని ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. ఈ బృందానికి బీఎంసీ కనీసం రూ.రెండు లక్షలైనా సాయం చేయాలని స్వతంత్ర కార్పొరేటర్ విజయ్ తాండెల్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా మహిళా బృందానికి మేయర్ స్నేహల్ అంబేకర్, బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే సహాయం కూడా కోరగా సానుకూలంగా స్పందించారని తెలిపారు.