కారు ప్రమాదంలో మరణించిన మహిళా నేతలు
రాజకీయనాయకుల జీవితమంతా పెను వేగమే. మామూలుగా కార్లే వారి జీవితానికి వేగాన్నిస్తాయి. ఏ చిన్న సంఘటన జరిగినా శరవేగంగా చేరుకునేందుకు కారే వారి సాధనం. కానీ చాలా సందర్భాల్లో కారే వారి ప్రాణాలు తీస్తుంది. వేగమే నేరమౌతుంది. ఉజ్వల భవిష్యత్తున్న యువనేత్రి, వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నేత శోభానాగిరెడ్డి కూడా కారు వేగమే ప్రాణాలు తీసింది. కారు ప్రమాదాలు పలువరు మహిళా యువ నేతలను పొట్టనబెట్టుకున్నాయి. పిన్న వయసులోనే కారు ప్రమాదంలో చనిపోయిన కొందరు మహిళా నేతల వివరాలు ఇవి.
లేడీ డయానా: సందర్భం, నేపథ్యం వేరైనా లేడీ డయానా కూడా శరవేగంగా పరుగులు తీస్తున్న కారు పారిస్ లోని ఒక టన్నెల్ రోడ్డులో ప్రమాదానికి గురి కావడంతో చనిపోయారు. విషాదం ఏమిటంటే ఈ మాజీ బ్రిటిష్ యువరాణి వెంటాడుతున్న పాపరాజ్జి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చనిపోయారు. ఆమె కొన ఊపిరితో ఉంటే సాయం చేయడానికి బదులు పాపరాజ్జీ క్రూరాతిక్రూరంగా ఫోటోలు తీసుకుంటూ కాలం గడిపేసింది. శవంపై చిల్లర ఏరుకునేంత చిల్లర పని చేసింది పాపరాజ్జి.
(నాడు సౌందర్య... నేడు శోభ)
వనం ఝాన్సీ: అచ్చంపేటకి చెందిన వనం ఝాన్సీ శరవేగంగా ఎదిగిన మహిళా నాయకుల్లో ఒకరు. బిజెపి పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేసిన వనం ఝాన్సీ కూడా కారు ప్రమాదంలోనే హఠాన్మరణం పాలయ్యారు. ఎంతో భవిష్యత్తున్న యువనేత ఉన్నట్టుండి కనుమరుగయ్యారు.
శోభా నాగిరెడ్డి: చివరి క్షణం వరకూ రాజకీయ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నారు శోభా నాగిరెడ్డి. కొద్ది గంటల క్రితమే ఆమె కర్నూలు జిల్లాలో షర్మిల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరినీ ఆత్మీయంగా పలకరించి, చిరునవ్వులు చిలికించిన యువనేత కొద్ది గంటల తరువాతే తిరిగి రాని లోకాలకు వెళ్లడం నిజంగా తీరని విషాదమే.