women sale
-
అభాగ్య మహిళలపై గురి..దుబాయ్‌లో అమ్మకం
సాక్షి, బెంగళూరు: అభాగ్య వనితలను మభ్యపెట్టి దుబాయ్‌లో ఉద్యోగాల పేరిట అమ్మేస్తున్న ముఠా బాగోతం బెళగావిలో వెలుగులోకి వచ్చింది. ఒక బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది. వివరాలు... బెళగావిలోని నిరుపేద మహిళలు, వితంతువులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని బెళగావికి చెందిన వహీదా మకందార్, షంషుద్దీన్ మకందార్‌లు మభ్యపెట్టేవారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉంటున్న షానవాజ్‌ను ,ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించి ఆమెను దుబాయ్‌కు పంపించారు. అక్కడైతే జీతం దండిగా వస్తుందని, సమస్యలన్నీ తీరిపోతాయని ఆమెకు ఆశలు చూపించారు. అయితే అక్కడ ఆమెను ఉద్యోగానికి కాకుండా, దుబాయ్ సేఠ్‌లకు అమ్మేశారని కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. దుబాయ్‌లో చిత్రహింసలు దుబాయ్‌కు వెళ్లిన షానవాజ్ అక్కడ తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, తిరిగి దేశానికి వెళ్తానంటే తనను తీవ్రంగా కొట్టి చెయ్యి విరగ్గొట్టారని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిపింది. తనను అక్కడి వారికి రూ.10 లక్షలకు అమ్మేశారని, ఎలాగైనా తనను ఈ నరకం నుండి తప్పించాలని మొరపెట్టుకుంది. దీంతో షానవాజ్ కుటుంబ సభ్యులు బెళగావి పోలీసులను ఆశ్రయించారు. తమ తల్లిని దుబాయ్‌కి తీసుకెళ్లి అమ్మేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆమెను తిరిగి భారత్‌కు రప్పించాలని ఫిర్యాదులో షానవాజ్ కూతురు కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్నాం: పోలీస్ కమిషనర్ ఈ విషయంపై బెళగావి కమిషనర్ కె.రామచంద్రరావు మాట్లాడుతూ.... డబ్బు ఆశ చూపి మహిళలను విదేశాలకు అమ్ముతున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ముంబైలో ఉన్న ముఠాతో కలిసి కొంతమంది స్థానికులు ఇలా మహిళలను విదేశాలకు అమ్మేస్తున్నారని చెప్పారు. షానవాజ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. -
ఆమె ఖరీదు లక్షా ఎనభైవేలు..!
బోథ్: భర్త చనిపోవడంతో ఓ మహిళను... అత్తింటివాళ్లు అమ్మేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తమ కుమార్తె ఆచూకీ తెలపాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన లలిత అనే మహిళను ఆమె బావ (భర్త సోదరుడు) గుజరాత్లో అమ్మేసినట్లు తెలుస్తోంది. బోథ్ మండలం సొనాల గ్రామానికి చెందిన లలిత తల్లి గంగుబాయి, సోదరుడు జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. లలితను మూడేళ్ల క్రితం నేరడిగొండ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన రమేశ్‌కిచ్చి పెళ్లి చేశారు. వీరికి కూతురు శివానీ పుట్టిన ఏడాదికే రమేశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో లలిత తన కూతురుతో కిష్టాపూర్‌లోని అత్తవారింట్లోనే ఉంటూ స్థానిక పాఠశాలలో రోజువారి వేతనం కింద అటెండర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తోంది. కాగా ఆమె బావ చౌహాన్ అర్జున్ తరచూ లలితను వేధించేవాడు. నెల రోజులుగా లలిత క్షేమ సమాచారాలు తెలియకపోవడంతో ఆమె సోదరుడు జగదీశ్ కిష్టాపూర్‌కు వెళ్లి విచారించాడు. తన సోదరిని ఇచ్చోడ గ్రామానికి చెందిన రేఖ, శారదలతో కలిసి చౌహాన్ అర్జున్ గుజరాత్లో అమ్మేసినట్లు తెలిసిందని జగదీశ్ పేర్కొన్నాడు. ఇదే విషయం అర్జున్ను అడగగా తనకేమీ తెలియదని చెప్పగా మేనకోడలును తీసుకుని సొనాలకు వెళ్లానని తెలిపాడు. కాగా మంగళవారం రాత్రి మద్యం సేవించి సొనాలలోని తమ ఇంటికి వచ్చిన అర్జున్ పరుష పదజాలంతో దుర్భాషలాడి దాడికి యత్నించాడని జగదీశ్ వాపోయాడు. అదే రోజు సాయంత్రం తన సోదరి లలిత ఫోన్ చేసి తనను గుజరాత్లో రూ.లక్షా 80వేలకు అమ్మేశారని తెలిపినట్లు జగదీశ్ పేర్కొన్నాడు. దీంతో బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపాడు. కాగా ఓ మహిళను విక్రయించడం జిల్లాలో సంచలనానికి దారితీసింది.