సాక్షి, బెంగళూరు: అభాగ్య వనితలను మభ్యపెట్టి దుబాయ్‌లో ఉద్యోగాల పేరిట అమ్మేస్తున్న ముఠా బాగోతం బెళగావిలో వెలుగులోకి వచ్చింది. ఒక బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది. వివరాలు... బెళగావిలోని నిరుపేద మహిళలు, వితంతువులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని బెళగావికి చెందిన వహీదా మకందార్, షంషుద్దీన్ మకందార్‌లు మభ్యపెట్టేవారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉంటున్న షానవాజ్‌ను ,ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించి ఆమెను దుబాయ్‌కు పంపించారు. అక్కడైతే జీతం దండిగా వస్తుందని, సమస్యలన్నీ తీరిపోతాయని ఆమెకు ఆశలు చూపించారు. అయితే అక్కడ ఆమెను ఉద్యోగానికి కాకుండా, దుబాయ్ సేఠ్‌లకు అమ్మేశారని కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు.
దుబాయ్‌లో చిత్రహింసలు
దుబాయ్‌కు వెళ్లిన షానవాజ్ అక్కడ తనను చిత్రహింసలకు గురి చేస్తున్నారని, తిరిగి దేశానికి వెళ్తానంటే తనను తీవ్రంగా కొట్టి చెయ్యి విరగ్గొట్టారని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిపింది. తనను అక్కడి వారికి రూ.10 లక్షలకు అమ్మేశారని, ఎలాగైనా తనను ఈ నరకం నుండి తప్పించాలని మొరపెట్టుకుంది. దీంతో షానవాజ్ కుటుంబ సభ్యులు బెళగావి పోలీసులను ఆశ్రయించారు. తమ తల్లిని దుబాయ్‌కి తీసుకెళ్లి అమ్మేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఆమెను తిరిగి భారత్‌కు రప్పించాలని ఫిర్యాదులో షానవాజ్ కూతురు కోరారు.
కేసు దర్యాప్తు చేస్తున్నాం: పోలీస్ కమిషనర్
ఈ విషయంపై బెళగావి కమిషనర్ కె.రామచంద్రరావు మాట్లాడుతూ.... డబ్బు ఆశ చూపి మహిళలను విదేశాలకు అమ్ముతున్న ఘటనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. ముంబైలో ఉన్న ముఠాతో కలిసి కొంతమంది స్థానికులు ఇలా మహిళలను విదేశాలకు అమ్మేస్తున్నారని చెప్పారు. షానవాజ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment