8న లేడీస్ స్పెషల్
♦ మహిళలకు ప్రత్యేకంగా లైసెన్స్ మేళా
♦ విమెన్ స్పెషల్ స్లాట్లు అందుబాటులోకి తెచ్చిన ఆర్టీఏ
సాక్షి, హైదరాబాద్: అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకొని అద్భుతమైన విజయాలను సాధిస్తున్న మహిళలు డ్రైవింగ్‌లో మాత్రం ఇంకా ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు. ఇప్పటికీ డ్రైవింగ్ విషయంలో ఇతరులపైనే ఆధారపడి ఉన్నారు. డ్రైవింగ్‌లో అనుభవం, నైపుణ్యం ఉన్నప్పటికీ లైసెన్స్ తీసుకునే విషయంలో అశ్రద్ధ చూపుతున్నారు. ఖైరతాబాద్, సికింద్రాబాద్, మలక్‌పేట్, బహదూర్‌పురా, మెహదీపట్నం ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో 20,62,541 మంది మగవారు డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉంటే మహిళలు 1,23,437 మంది మాత్రమే ఉన్నారు.
సొంతంగా ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లేందుకు, స్లాట్ నమోదు చేసుకొనేందుకు మహిళలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని రవాణా శాఖ ‘మహిళా డ్రైవింగ్ లైసెన్స్ మేళా’కు శ్రీకారం చుట్టింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో మహిళలకు లెర్నింగ్ లైసెన్సులు అందజేయనున్నట్లు హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ నాయక్ తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
స్లాట్ నమోదు చేసుకోవచ్చు...
మార్చి 8న సికింద్రాబాద్, ఖైరతాబాద్, మలక్‌పేట్, మెహదీ పట్నం, బహదూర్‌పురా ఆర్టీఏ కార్యాలయాల్లో మహిళలు మాత్రమే లెర్నింగ్ లైసెన్సు తీసుకొనేలా స్లాట్స్ (సమయం+ తేదీ) ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఈ కేంద్రాల్లో మహిళా ఎంవీఐలు, మహిళా అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండి లెర్నింగ్ లైసెన్సులకు హాజరయ్యే మహిళలకు పరీక్షలు నిర్వహిస్తారు. మిగతా కార్యాలయాలు ఉప్పల్, అత్తాపూర్, మేడ్చల్, కూకట్పల్లి, తదితర ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రత్యేకంగా స్లాట్స్ అందుబాటులో లేనప్పటికీ ఆ రోజు లెర్నింగ్ లైసెన్సుతో పాటు, వివిధ రకాల పౌరసేవల కోసం వచ్చే మహిళలకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేస్తారు.