పోలీసులమంటూ అర్ధరాత్రి హల్చల్
- మహిళా సర్పంచ్‌ను రివాల్వర్‌తో బెదిరించిన దుండగులు
- ద్విచక్రవాహనం, సెల్ ఫోన్‌తో పరారీ
- అధికార పార్టీ నాయకులపైనే అనుమానం!
చాగలమర్రి: పోలీసులమని చెప్పి ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి హల్చల్ చేశారు. ముత్యాలపాడు గ్రామ సర్పంచ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు స్వప్న ఇంట్లోకి మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడ్డారు. మహిళ అని చూడకుండా రివాల్వర్ చూపించి బెదిరించడంతో కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటనపై సర్పంచ్ స్వప్న బుధవారం చాగలమర్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలు, పోలీసుల కథనం మేరకు.. స్వప్న కుటుంబ సభ్యులతో ఇంట్లో నిద్రిస్తుండగా ఎనిమిది మంది గుర్తు తెలియని వ్యక్తులు పోలీసుల మంటు వచ్చి లేపారు. మీ మరిది బాబావలి ఎక్కడా అంటూ ఆమెను అడగడంతో.. మీరు ఎవరు, ఈ సమయంలో ఎందుకు వచ్చారని సర్పంచ్ ప్రశ్నించారు. మేము పోలీసులమని, బాబావలిని సీఐ తీసుకురమ్మన్నాడని చెప్పారు.
అతను ఎక్కడున్నాడో చెప్పకపోతే మిమ్మళ్లి ఈడ్చుకెళ్తామని బెదించారు. ఇంట్లో ఉన్న సామాన్లను చెల్లాచెదురు చేసి సెల్‌ఫోన్, బయట నిలిపిన ద్విచక్ర వాహానాన్ని తీసుకొని వెళ్లారు. ఈ మేరకు సర్పంచ్ స్వప్న, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్సర్‌బాష, జగదీశ్వరరెడ్డి, పుల్లయ్య, ముల్లా ఖాదర్‌బాష, స్వామిరెడ్డి ఎస్ఐ హరిప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా సర్పంచ్ విలేకరులతో మాట్లాడుతూ తన భర్త మస్తాన్‌వలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 1వ ఎంపీటీసీ స్థానానికి ఎంపీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో మరుసటి రోజు నుంచి టీడీపీ నాయకులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
అక్రమ కేసులలో ఇరికించడమే కాకుండా ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు బనాయిస్తు మూడు నెలలుగా తన భర్తను జైల్లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. మస్తాన్ వలి జైల్లో ఉండే కూడా ఎంపీటీసీగా గెలుపొందారని చెప్పారు. తన అనుచర ఎంపీటీసీలతో అధికార పార్టీలోకి రావాలని తన భర్తపై టీడీపీ నాయకులు ఒత్తిడి తెస్తూ, ఇబ్బందులు పెడుతున్నారని ఆమె వాపోయారు. ఇందులో భాగంగానే అర్ధరాత్రి మా ఇంటిపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రాణం పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, భూమా నాగిరెడ్డి నాయకత్వాన్ని వదలి వెళ్లే ప్రసక్తే లేదని స్వప్న స్పష్టం చేశారు.