ఆసియా కప్ హాకీలో భారత్‌కు కాంస్యం
బ్యాంకాక్: మహిళల అండర్–18 ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో భారత్‌కు కాంస్యం దక్కింది. కొరియాతో గురువారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 3–0తో ఘనవిజయం సాధించింది. హాకీ ఇండియా తమ ఆటగాళ్లకు ప్రోత్సాహకగా రూ. లక్ష చొప్పున నజరానా ప్రకటించింది. సహాయక సిబ్బందికి రూ.50 వేల చొప్పున అందించనుంది.
సంగీత కుమారి (55, 58వ నిమిషాల్లో) రెండు గోల్స్‌తో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. రితు (45) మరో గోల్ చేసింది. ఇరు జట్లు మెరుగ్గా తలపడటంతో ప్రథమార్థంలో గోల్స్ నమోదు కాలేదు. కొరియాకు పలు పెనాల్టీ కార్నర్ అవకాశాలు దక్కినా భారత డిఫెన్స్ గట్టిగా నిరోధించగలిగింది. ద్వితీయార్ధంలో భారత్ విజృంభించి మూడు గోల్స్‌తో విరుచుకుపడింది.