పంతం నెగ్గించుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్
టీఆర్ఎస్కు సవాలు విసిరి మరీ విజయం
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటాలో జరిగిన శాసన మండలి ఎన్నికలు కాంగ్రెస్‌లో జోష్ నింపాయి. గత సాధారణ ఎన్నికల తర్వాత వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న కాంగ్రెస్‌కు నల్లగొండలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపు నూతనోత్తేజాన్ని కలిగించింది. నల్లగొండలో భారీ మెజారిటీ రావడంతో ఆ పార్టీ నేతలు, శ్రేణుల్లోనూ భవిష్యత్తుపై ఆశలు చిగురిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌లో కూడా గెలవడంతో ఆ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అయితే నల్లగొండలో గెలుపును పార్టీ శ్రేణులు ఎక్కువగా ఆస్వాదిస్తున్నాయి.
ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నల్లగొండ మండలి ఎన్నికల్లో కోమటిరెడ్డి బద్రర్స్ పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి నిష్ర్కమిస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ చేశారు. రాజగోపాల్‌రెడ్డి గెలిచి, టీఆర్ఎస్ ఓడిపోతే సీఎం కూడా రాజీనామా చేస్తారా అంటూ కాలు దువ్వారు. దీంతో ఆ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్ రెడ్డి కూడా టీఆర్ఎస్ గెలుపును భుజాలపై వేసుకున్నారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్పై సవాల్ విసిరి, పంతాన్ని నెగ్గించుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్‌పై పార్టీలో విశ్వాసం పెరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జిల్లాలో ఉన్న ముఖ్యనేతలు అందరినీ కలుపుకుని పోయి గెలుపొందడం ద్వారా జిల్లాలో తమ రాజకీయ ఆధిపత్యాన్ని మరోసారి కోమటిరెడ్డి బ్రదర్స్ నిలుపుకున్నట్టైంది.
సోనియాకు అంకితం: రాజగోపాల్‌రెడ్డి
తన విజయాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, నల్లగొండ జిల్లా ప్రజలకు అంకితమిస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కౌంటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియాకు నూతన సంవత్సర కానుకగా ఈ విజయాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. ఈ ఎన్నికలో ధర్మం గెలిచిం దని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా జిల్లా ప్రజాప్రతినిధులు ఓట్లేశారన్నారు. తన విజ యానికి సహకరించిన సీఎల్పీ నేత జానారెడ్డి, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, సీపీఐ నేతలు, ఇతర పార్టీల నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.