పాక్‌ను ‘ఉడి’కిస్తోన్న భారత్!
ఉగ్రదాడికి ముందు.. తర్వాత...
(సాక్షి, ప్రత్యేక ప్రతినిధి)
‘ఉడీ ఘటనపై తగిన సమయంలో తగిన విధంగా స్పందిస్తాం’
- 18మంది భారత జవాన్లను బలిగొన్న ఉగ్రదాడి జరిగిన రోజు భారత డెరైక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్‌సింగ్.
‘ఉడీదాడిని భారత్ ఎన్నటికీ మరచిపోదు. భారత జవాన్ల త్యాగాలు వృథా కానివ్వం. ఉగ్రవాదాన్ని ఓడించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం’
- కోజికోడ్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగపూరిత ప్రసంగం..
ఈ రెండు స్పందనలు చాలు.. పాకిస్తాన్ ఉగ్రవాద ముష్కరుల విషయంలో భారత్ కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నదని తెలుసుకోవడానికి. భారత సైన్యం బుధవారం జరిపిన లక్ష్యిత దాడులు (సర్జికల్ ఎటాక్స్) వాటిని రుజువు చేశాయి. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌తో భారత్ కావాలనే మెతకగా వ్యవహరిస్తోన్నదని విమర్శించేవారికి ఈ దాడులు గట్టి సమాధానం చెప్పాయి. అందుకే దేశవ్యాప్తంగా అందరూ ఈ దాడులకు హర్షామోదాలు వెలిబుచ్చుతున్నారు. 2001లో జైషే మొహమ్మద్ దుండగులు పార్లమెంటుపై దాడికి తెగబడినప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి, 2008లో లష్కరే తోయిబా ముష్కరులు ముంబై దాడులకు బరితెగించినప్పుడు మన్మోహన్ సింగ్ చేయలేని పనిని ఇపుడు ప్రధాని నరేంద్రమోదీ చేసి చూపించారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
జూలైలోనే వేడెక్కిన సరిహద్దు
నిజానికి ఉడి ఉగ్రదాడికి ముందు నుంచే భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో అలజడి చెలరేగింది. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీని జూలై 8న భద్రతా దళాలు మట్టుబెట్టిన తరుణంలో కాశ్మీర్ రగులుకుంది. సామాన్య ప్రజలకు, సాయుధ దళాలకు మధ్య జరిగిన ఘర్షణలలో 56 మంది వరకు మరణించారు. వందలమంది గాయపడ్డారు. ఆగస్టు9న స్పందించిన ప్రధాని గత ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి భిన్నంగా దూకుడుగా వ్యవహరించారు. వేర్పాటువాదులతో చర్చల ప్రసక్తిలేదని, దేశభద్రత విషయంలో రాజీ సమస్యే లేదని అఖిలపక్ష సమావేశంలో స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ భూభాగాన్ని (పీవోకేను) భారత్‌లో విలీనం చేయడమే దేశ ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు. అంతేకాదు బలూచిస్తాన్‌లో పాక్ సైన్యం సృష్టిస్తున్న హింసాకాండను ప్రపంచం దృష్టికి తీసుకురావాలని వ్యాఖ్యానించారు. ఉడీ కల్లోలం...
సరిహద్దులోని భారత సైనిక స్థావరం ఉడీపై సెప్టెంబర్ 18న పాక్ ఉగ్రవాద ముష్కరులు చేసిన దాడిలో 17మంది జవాన్లు మరణించడం యావద్దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు తెల్లవారుజామున చీకటిమాటున దాడి చేశారు. స్థావరంలోని తాత్కాలిక గుడారాలలో సైనికులు నిద్రిస్తుండగా దాడి జరగడంతో పెద్ద నష్టం జరిగింది. ఒక రెజిమెంటు స్థానంలో మరో రెజిమెంటు బాధ్యతలను స్వీకరించడం కోసం వచ్చిన సమయం చూసి ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు.
వరుస పరిణామాల నేపథ్యంలో సరిహద్దులోని మన సైనిక స్థావరాలపై భారీ ఉగ్రదాడి జరిగే అవకాశాలున్నాయని నిఘా విభాగం నుంచి సమాచారం ఉన్నప్పటికీ అప్రమత్తం కాకపోవడం వల్లనే ఈ దారుణం చోటుచేసుకున్నదన్న విమర్శలున్నాయి. అధీనరేఖకు కూతవేటు దూరంలో 15 వేల నుంచి 16 వేల మంది సైనికులుండే పెద్ద స్థావరంపైనే దాడికి తెగబడడం మన భద్రతా వ్యవస్థపైనే అనుమానాలు రేకెత్తించింది.
అంతర్జాతీయ వేదికపై పాక్ ఆక్రోశం..
దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు.. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను ఆడిపోసుకోవడం ఆది నుంచి జరుగుతున్నదే. ఉడీ ఘటనానంతరం జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కశ్మీర్ అంశాన్ని, హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ ఘటనను ప్రస్తావించారు. కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేశారు.
అయితే అంతర్జాతీయంగా మద్దతు లభిస్తుందన్న పాక్ ప్రధాని ఆశలను వమ్ముచేస్తూ కశ్మీర్‌సహా అన్ని ద్వైపాక్షిక సమస్యలను భారత్, పాక్‌లే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ స్పష్టం చేశారు. పాక్ ఉగ్రవాద దేశమని, ఉగ్రవాదాన్ని పావుగా వాడుకుని యుద్ధనేరాలకు పాల్పడుతోందని భారత్ సమితి సమావేశాలలో తూర్పారబట్టింది. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దేశాలను ఏకాకులను చేయాలని పిలుపునిచ్చింది. పాకిస్తాన్‌తో స్నేహం కోసం ప్రయత్నిస్తే దానికి బదులుగా భారత్‌కు ఉగ్రదాడులు లభించాయని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వ్యాఖ్యానించారు. మొత్తానికి పాకిస్తాన్‌ను భారత్ ఏకాకిని చేయగలిగింది.
దక్షిణాసియాలో ఒంటరైన పాక్
ఐక్యరాజ్యసమితిలో ఎవరి మద్దతు లేకుండా చేయగలిగిన భారత్... దక్షిణాసియా దేశాలలోనూ పాకిస్తాన్‌ను ఒంట రిని చేయగలిగింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కారాదని భారత్ నిర్ణయించడంతో అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్కూడా దానిని అనుసరించాయి. చివరకు సదస్సు వాయిదా పడినట్లు సార్క్ అధ్యక్ష దేశం నేపాల్ ప్రకటించింది. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్‌లు పాకిస్తాన్‌ను పరోక్షంగా తిట్టిపోశాయి.
నెత్తుటేర్లకు నీళ్లతో సమాధానం
ఉగ్రవాదులను ఎగదోస్తూ నెత్తుటేర్లు పారిస్తున్న పాకిస్తాన్‌కు ‘నీళ్ల దండన’ విధించాలని భారత్ భావిస్తోంది. పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న నదుల నీటిని గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా ఆ దేశాన్ని కట్టడి చేయాలని భారత్ నిర్ణయించింది. 56 ఏళ్ల నాటి భారత్- పాక్ సింధు జలాల ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జల విద్యుత్ ప్రాజెక్టులు, సాగునీరు, తాగునీటి నిల్వ కోసం ఇక నుంచి సింధు, చీనాబ్, జీలం నదుల్లోంచి గరిష్ట స్థాయిలో నీటిని వినియోగించాలంటూ అవగాహనకు వచ్చారు. అధ్యయనం కోసం టాస్క్ ఫోర్స్ బృందాల్ని ఏర్పాటు చేయనున్నారు. ‘నెత్తురు, నీళ్లు కలసి ఒకేసారి ప్రవహించలేవు’ అన్న మోదీ వ్యాఖ్య చాలు.. పాకిస్తాన్ విషయంలో భారత్ ఎంత కఠినంగా వ్యవహరించబోతున్నదో తెలియడానికి.