వేధింపులు తాళలేక ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం
రాజోలు(తూర్పు గోదావరి జిల్లా) :
ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక రాజోలు ఆర్టీసీ డిపో డ్రైవర్ గొల్ల శేఖర్ శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లి తిరిగివస్తుండగా బస్సు టైర్ పంక్చర్ అయ్యింది. దాంతో టైరు మార్చుకొని రాజోలు డిపోకు వచ్చిన తర్వాత డిపోలో మెకానికల్ ఫోర్ మెన్ (ఎంఎఫ్) పంక్చరైన టైరును గ్యారేజీ నోటీసు బోర్డు వద్ద పెట్టి డ్రైవర్ శేఖర్ పేరు రాయడంతో అతను మనస్తాపం చెందినట్టు బంధువులు వివరించారు.
నోటీసు బోర్డు వద్ద తన పేరు ఉండడంతో తోటి డ్రైవర్లు, కార్మికుల మధ్య అవమానం జరిగిందనే బాధతో శేఖర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువులు హుటాహుటిన శేఖర్‌ను రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అతనికి ప్రాణాపాయం తప్పిందని యూనియన్ నాయకులు తెలిపారు. తరుచూ డిపోలో చాలా మంది డ్రైవర్లు వేధింపులను ఎదుర్కొనవలసి వస్తోందని వారు పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులను, డ్రైవర్లను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.