ప్రైవేటు నిర్ణయం తగదంటూ ఆందోళన..
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా
కాకినాడ సిటీ :
మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించరాదని డిమాండ్ చేస్తూ ఆ పథకం కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. 25 వేల మంది పిల్లలకు ఒకేచోట వండి పంపిణీ చేయించాలంటూ ప్రభుత్వం మెమో విడుదల చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం జేసీ మల్లికార్జునకు ఈమేరకు వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల జిల్లాలోని ఎనిమిది వేల మంది ఈ çపథకం కార్మికులకు ముఖ్యంగా మహిళలకు ఉపాధి పోతుందన్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణం రద్దు చేయాలని, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఏర్పాటుకు సదుపాయాలు మెరుగుపర్చాలని, వారానికి మూడు గుడ్ల సరఫరా, బిల్లులు, వేతనాలు ప్రతి నెలా 5వ తేదీలోపు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆరోగ్యరీత్యా, కార్మికుల ఉపాధిపరంగా చూస్తే పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వల్ల నష్టమేనన్నారు. మెనూ బడ్జెట్ను పెంచి పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసే చర్యలు తీసుకోవాలని ఈ పథక కార్మికుల యూనియన్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.