ఈఎస్ఐ.. వైద్యం నై
కార్డులున్నా ప్రయోజం సున్నా
చికిత్సకు నోచుకోని కార్మికులు
వేతనాల్లో ప్రతి నెలా రూ.1.26 లక్షల కోత
అయినా ప్రైవేటు ఆస్పత్రుల్లో చెల్లని వైనం
శాఖల మధ్య కొరవడిన సమన్వయం
మున్సిపాలిటీలో ‘కంపు’ వ్యవహారం
సంగారెడ్డి మున్సిపాలిటీ:శాఖల మధ్య కొరవడిన సమన్వయం కార్మికులకు శాపంగా మారింది. ఈఎస్ఐ కార్డులున్నా వైద్యం అందని ద్రాక్షగా మారింది. ప్రభుత్వ, ప్రయివేట్ రంగాల్లోని సంస్థలు, కార్యాలయాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఉచితంగా వైద్యం అందించేందుకు కార్మిక శాఖ ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించింది. కార్మికులు కార్డులు తీసుకుని ప్రైవేటు ఆస్పత్రులకు వెళితే వాటిని తిరస్కరిస్తున్నారు. కార్మికుల వేతనాలలో డబ్బును కట్ చేసినప్పటికీ ఈఎస్ఐ ఖాతాలో జమచేయని కారణంగానే చెల్లుబాటు కావడంలేదని తెలిసింది.
సంగారెడ్డి మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పద్ధతిలో సుమారు 300 మంది కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. ప్రతి నెలా పీఎఫ్ ఖాతాలో రూ.4.96 లక్షలు, ఈఎస్ఐ ఖాతాలో 1.26 లక్షల రూపాయలను కార్మికుల వేతనాల్లోంచి కట్ చేసి జమ చేస్తున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. కాని కార్మిక శాఖ అధికారులు మాత్రం 2011-12 వరకు మాత్రమే చెల్లించారని దాని తర్వాత ఈఎస్ఐ డబ్బులు చెల్లించని కారణంగానే ప్రయివేట్ అసుపత్రులలో అమలు చేయడం లేదని చెబుతున్నారు. 2012 నుంచి 2016 మే వరకు కార్మికుల వేతనాల్లోంచి కోతలు విధిస్తున్నా వారి వారి ఖాతాలో జమ చేయలేదని తెలిసింది.
ఎక్కడ జమ అవుతున్నాయో?
నెలకు ఈఎస్ఐ, పీఎఫ్ పేరుతో ప్రతి నెలా రూ.6.22 లక్షలను కార్మికుల వేతనాల్లోంచి తీసుకుంటున్నారు. కాని అ డబ్బులు ఏ ఖాతాలో జమ అవుతున్నాయో ఎవ్వరికీ తెలియడం లేదు. కాంట్రాక్ట్ కార్మికులకు గాని వారి బంధువులకు అనారోగ్యానికి గురైన సమయంలో ఈఎస్ఐ కార్డు తీసుకుని ప్రయివేట్ ఆస్పత్రులకు వెళితే మీ ఖాతాలో డబ్బులు లేవని అందుకు కార్డుపై వైద్యం చేయడం లేదని సూచిస్తున్నారు. దీంతో కార్మికులు చేసేది లేక డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకుంటున్నారు.
మల్లేశం.. మున్సిపాలిటీలో ట్రాక్టర్ డ్రైవర్‌గా తొమ్మిది సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అతని కుమారుడికి మూర్చ వ్యాధి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఈఎస్ఐ కార్డు చూపించడంతో వారు సంబంధిత ఖాతాలో డబ్బులు లేవని వైద్యం చేయడం వీలు కాదని చెప్పారని బాధితుడు తెలిపారు. దీంతో తాను ఏజేసీని కలవడంతో లేఖ ఇచ్చారని, దీంతో ప్రయివేట్ అసుపత్రిలో వైద్యం అందించారని తెలిపారు.
మాణయ్య.. ఎలక్ట్రికల్ విభాగంలో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఇతని కుమారుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. వైద్యం కోసం వెళితే ఈఎస్ఐ కార్డు చెల్లదని వెనక్కి పంపించారని అవేదన వ్యక్తం చేశారు.
కుమార్.. మున్సిపాలిటీలో ట్రాక్టర్ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. ఇతను లీవర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆసుపత్రిలో వైద్యం కోసం చేరినప్పటికీ ఈఎస్ఐ కార్డుపై వైద్యం చేయడం లేదని తెలిపారు.
తమ వేతనంలోంచి నెలకు రూ.1150 నుంచి 1250 రూపాయల వరకు ఈఎస్ఐ, పీఎఫ్ పేరుతో కోతలు విధిస్తున్నా తమకు మాత్రం ఉపయోగం లేకుండా పోతుందన్నారు. సంవత్సరానికి రూ.12,36 లక్షల చొప్పున 2012 నుంచి ఈఎస్ఐ, పీఎఫ్ ఖాతలో అధికారులు జమ చేయాలేక పోయారు. కాని కార్మికుల వేతనాల్లోంచి కట్ చేసిన డబ్బులను ఎక్కడ జమ చేశారో తెలియడం లేదు.
రూ. రెండు కోట్లు చెల్లించాం
కార్మికులకు సంబంధించిన ఈఎస్ఐ, పీఎఫ్ 2011 నుంచి 2014 వరకు పెడింగ్‌లో ఉంటే తాను వచ్చాక వాటిని రెగ్యులర్ చేశాం. 2016 వరకు బకాయి ఉన్నా రెండు కోట్ల రూపాయలను ఈఎస్ఐ ఖాతాలో జమచేశాం. టెక్నికల్ సమస్య కారణంగా కొందరికి అసౌకర్యం కలిగిన మాట వాస్తవమే. మే నుంచి జూలై వరకు మాత్రం ఈఎస్ఐ డబ్బులు చెల్లించలేక పోయామని, వాటిని సైతం ఈ నెలలో చెల్లిస్తాం.
వాసం వెంకటేశ్వర్లు, ఇన్చార్జి కమిషనర్
కార్డున్నా ఉపయోగం లేదు
15 ఏళ్లుగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నా.. ఈఎస్ఐ పేరుతో ప్రతి నెలా వేతనంలో కట్ చేస్తున్నారు. కాని ఆస్పత్రులకు వెళ్తే కార్డు వర్తించదంటున్నారు. సొంత డబ్బులు పెట్టి వైద్యం చేయించుకుంటున్నాం. పలుమార్లు ఈఎస్ఐ అధికారి సుకుమారిని ప్రశ్నిస్తే తమకు మున్సిపల్ నుంచి చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వనందునే కార్డులు పనిచేయడం లేదని అంటున్నారు. మున్సిపల్ అధికారులు మాత్రం ఈఎస్ఐకి బకాయి లేమని అంటున్నారు. మా డబ్బులేమవుతున్నాయో మరి.
- - సుధాకర్, కాంట్రాక్ట్ కార్మికుడు
అందని వైద్యం
వేతనం నుంచి ప్రతి నెలా ఈఎస్ఐ, పీఎఫ్ పేరుతో రూ.950 కట్ చేస్తున్నారు. ఈఎస్ఐ కార్డుతో వెళ్తే ప్రైవేట్ అసుపత్రుల్లో వైద్యం చేయడం లేదు. పిల్లలు అనారోగ్యానికి గురైతే బంగారు ఆభరణాలు అమ్ముకుని ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించాం. నా జీతం నుంచి తొమ్మిదేళ్లుగా కట్అవుతున్నా.. ఆ డబ్బు ఈఎస్ఐకి జమ చేయడం లేదు.
- - రాములు, కాంట్రాక్ట్ కార్మికుడు
ఈఎస్ఐ అధికారి వివరణ..
కార్మికులకు సంబంధించి ఈఎస్ఐ కార్డుపై ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం చేయడం లేదని, వారి కార్డు నంబర్లపై డబ్బులు లేవనే విషయాన్ని ఈఎస్ఐ అధికారి సుకుమారి దృష్టికి తీసుకెళ్లగా కార్మికుల వివరాలు... వాట్సాప్‌లో పెడతానని మాత్రమే చెప్పారు. ఆ తరువాత మరింత వివరణ కోసం యత్నించగా, అందుబాటులోకి రాలేదు.