పనిలేని పోటుగాళ్లు
హైదరాబాద్:
బతకాలంటే ఏదో ఒక పని చేయాలి. కుటుంబాన్ని పోషించాలంటే చిన్న ఉద్యోగమైనా ఉండాలి. పని కోసం వివిధ ప్రాంతాలవారు మహానగరానికి వలస బాట పడుతుంటే.. ఇక్కడ ఉన్నవారు మాత్రం పనీపాటా లేకుండా గడిపేస్తున్నారు. ‘పని’ చూపిస్తామని దేశవిదేశాలకు చెందిన కంపెనీలు వస్తుంటే.. వీటితో తమకేంటన్నట్టు కాలం గడిపేస్తున్నారు. ఇలాంటి వారు నగరంలో లక్షన్నర మందికి పైగా ఉన్నారంటే అశ్చర్యం కలుగుతుంది. ఎలాంటి పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్న వారిలో స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా ఉన్నారు. ఇందులో చదువుకున్న వారే అధికం. ఈ లెక్కలు కేంద్రం ఆధీనంలోని జనాభా గణాంక శాఖ తేల్చినవే. సిటీలో ఉన్న బిచ్చగాళ్లలో డిగ్రీ, టెక్నికల్ డిప్లొమో, పీజీ చదువుకున్నవారు సైతం ఉన్నారట.
నాన్-వర్కర్స్ 25 లక్షల మంది
కేంద్ర జనాభా లెక్కల విభాగం 2011లో జనాభాను లెక్కించడంతో పాటు ఆర్థిక, సామాజిక కోణాల్లోనూ సమాచారం సేకరించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి వాటి క్రోడీకరణ, విశ్లేషణ, అధ్యయనం చేసింది. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని ‘ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్’ గత నెలలో అదనపు వివరాలను విడుదల చేసింది. హైదరాబాద్కు సంబంధించి ఇందులోని అంశాలు విస్తుగొలిపేలా ఉన్నాయి. రాష్ట్రాలతో పాటు నగరాలు, పట్టణాల వారీగా గణాంకాలను పొందుపరిచింది. సమాచారం సేకరించే నాటికి ఏపనీ చేయకుండా ఉన్నవారిని ‘నాన్-వర్కర్స్’ కేటగిరీలో చేర్చింది. సిటీకి సంబంధించి ఈ కేటగిరిలో ఉన్నవారు 25,30,026 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 9,72,990, స్త్రీలు 15,57,036 మంది ఉన్నారు.
‘అవన్నీ’ తీసేసిన తరవాత..
సిటీలో ఖాళీగా ఉన్న వారిని ఏడు కేటగిరీ కింద విభజించారు. విద్యార్థులు, గృహావసరాలకు పరిమితమైన వారు, వైకల్యం సహా అనేక కారణాల నేపథ్యంలో కుటుంబీకులపై ఆధారపడిన వారు, పదవీ విరమణ చేసినవారు, పెన్షనర్లను మినహాయించారు. విద్యార్థి దశకు చేరుకోకుండా తల్లి ఒడికి, ఇంటికి పరిమితమైన పసివారిని ‘ఖాళీ’ కేటగిరిలోకి చేర్చకుండా ‘డిపెండెంట్స్’గా విశ్లేషించారు. మిగిలిన 1,66,255 మందీ ఏ పనీ చేయకుండా ఖాళీగా ఉంటున్నారని లెక్క తేలింది. ఇలాంటి వారిలో స్త్రీల కంటే పురుషులే అధికంగా ఉన్నారని ‘సెన్సస్’ స్పష్టం చేసింది. స్త్రీల సంఖ్య 44 వేలుగా ఉండగా.. ‘మగ మహారాజులు’ దీనికి మూడు రెట్లతో ఏకంగా 1.2 లక్షల మందికి పైగా రికార్డులకెక్కారు.
‘అక్షరం’ నేర్చినా అక్కరకు రాకుండా..
విద్యావకాశాలు లేకో, విద్యార్హతలు సాధించలేకో ఖాళీగా ఉండిపోయారనుకుంటే పొరపాటే. ‘పనీపాటా’ లేని వారిలో నిరక్షరాస్యుల కంటే అక్షరాస్యులే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. ఖాళీగా ఉంటున్న నగరవాసుల్లో టెన్త్, ఆలోపు చదివిన వారి కంటే.. ఎస్సెస్సీ పూర్తయి, డిగ్రీ లోపు చదివిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. డిగ్రీ ఆపై విద్యార్హతలు గలవారూ సిటీలో ఖాళీగానే ఉన్నారని గణాంకాలు తేల్చాయి. అక్షరాస్యులై ఉండీ, ఏ పనీ చేయకుండా ఉన్న వారిలో పురుషులు 97,797 మంది ఉండగా, స్త్రీలు 33,651 మంది ఉన్నారు.
సిటీలో క్యాలిఫైడ్ బెగ్గర్స్..
సెన్సస్ డిపార్ట్మెంట్ నాన్-వర్కర్స్ కేటగిరీలో బిచ్చగాళ్లనూ చేర్చింది. వారికి సంబంధించిన అనేక అంశాలను సేకరించింది. వీటి ప్రకారం నగరంలో బిచ్చగాళ్ల సంఖ్య 1506గా తేల్చింది. ఇందులో స్త్రీల కంటే పురుషులే అధికమని లెక్కకట్టింది. చదువు లేని కారణంగా ఇతర పనులు చేసుకోలేక ఈ బాట పట్టినవారితో పాటు ‘క్వాలిఫైడ్ బెగ్గర్స్’ సైతం హైదరాబాద్లో ఉన్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నగరంలోని బిచ్చగాళ్లలో నిరక్షరాస్యులు 583 మంది ఉండగా, అక్షరాస్యులు 932 మంది ఉన్నట్టు నిర్ధారించింది. డిగ్రీ ఆపై చదివిన వారు 46 మంది ఉన్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన వీరు ‘చేతులు చాస్తున్నార’ని తెలుస్తోంది. డిగ్రీ, సాంకేతిక విద్య అభ్యసించిన వారు ఇద్దరు ఉండగా, డిగ్రీ కంటే ఎక్కువ చదివిన వారు 44 మంది ఉన్నట్లు గణాంకాల్లో స్పష్టం చేసింది.
అవకాశాలు కల్పించాలి..
నగరంలో ఉన్న అన్ని వర్గాల వారికీ, వారికున్న అర్హతలు, ఆసక్తుల ఆధారంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఏదో ఒక పని చేయాలనే అవగాహన అందరిలోనూ కల్పించాలి. బిచ్చగాళ్ల విషయానికి వస్తే... ఆదాయం ఎక్కువ, పన్ను ఉండదు అనే ఉద్దేశంతో కొందరు ఈ బాట పడుతున్నారు. వీరి నియంత్రణకు ప్రత్యేక చట్టం చేయాలి. బిక్షాటన చేస్తున్నవారికి వృత్తివిద్యల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా పరిస్థితి మార్చవచ్చు.
- వివేక్ నర్సింహం, చార్టెడ్ అకౌంటెంట్