ప్రాణహిత, చేవెళ్ల సొరంగ మార్గం
పనులు ప్రారంభం
తుర్కపల్లి, న్యూస్‌లైన్ : ప్రాణహిత, చేవెళ్ల సొరంగమార్గం పనులను సోమవా రం తుర్కపల్లి గ్రామ శివారులో ప్రాజెక్టు ఈఈ హైదర్‌ఖాన్ ప్రారంభించారు. పనులు ప్రారంభించడానికి ముందు ఆయన పనుల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడుతూ వారం రోజుల్లో సొరంగ మార్గం పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. త్వరగా పనులు పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. సుమారు 2 కిలోమీటర్ల మేర సొరంగమార్గం ఉంటుందని తెలిపారు. పనులు పూర్తికావడానికి రెండేళ్లు పడుతుందని తెలిపారు.
ప్రభుత్వ లెక్కల ప్రకారం 2019 వరకు ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు పనులు పూర్తి కావొచ్చునని వివరించారు. చాలా చోట్ల రైతుల నుంచి భూమి తీసుకునేటప్పుడు సమస్యలొచ్చాయని, వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. అధునాతన పద్ధతుల్లో సొరంగా మార్గం పనులు చేపడుతున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఏఎంఆర్ ఏజెన్సీ నిర్వాహకులు సుదర్శన్‌రెడ్డి, అమిత్‌రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్లు, సైట్ ఇంజనీర్లు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.