‘ఉపాధి’లో యంత్రాలు వినియోగిస్తే కేసు
త్వరలో నియోజకవర్గాల వారీగా సమీక్ష
ఎన్ఆర్ఈజీఎస్ పనులు పెంచాలి
ప్రభుత్వ లక్ష్యాలు సాధించాలి
పంచాయతీరాజ్ కమిషనర్ రామాంజనేయులు
గుంటూరు వెస్ట్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల నిర్వహణలో యంత్రాలను వినియోగించవద్దని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ బి.రామాంజనేయులు కోరారు. కూలీలు చేపట్టలేని పనులు, కూలీలు కోరిన మీదటనే యంత్రాలను ఉపయోగించాలని చట్టం చెబుతున్నదని వెల్లడించారు. అందుకు విరుద్ధంగా ఉపాధి హామీ పనుల్లో యంత్రాలను వినియోగిస్తే కేసులు పెట్టి, జైళ్లకు పంపుతామని రామాంజనేయులు హెచ్చరించారు. చెరువుల తవ్వకంలో యంత్రాలను వినియోగించినట్లు కొంతమంది ఎంపీడీఓలు అంగీకరించిన నేపథ్యంలో భవిష్యత్‌లో అటువంటి వాటికి స్వస్తి పలికి కూలీలకు పనులు కల్పించాలని ఆయన ఆదేశించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎన్ఆర్ఈజీఎస్ పనులు, సీసీ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, స్మార్ట్‌విలేజ్, తాగునీరు తదితర అంశాలపై కమిషనర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా రూ.1050 కోట్ల పనిదినాలు కోల్పోతుండగా, జిల్లాలో రూ.50 కోట్ల మేరకు పనిదినాలు కోల్పోతున్నారని వెల్లడించారు. కర్లపాలెం, దుగ్గిరాల, పెదకూరపాడు తదితర మండలాలు ఇచ్చిన లక్ష్యాలను సాధించి ముందంజలో ఉండటంతో ఆయా మండలాల ఎంపీడీఓలను ఆయన అభినందించారు. బెల్లంకొండ, రొంపిచర్ల, మాచర్ల, నరసరావుపేట తదితర మండలాలు పనులు కల్పించడంలో వెనుకబడి ఉండడంతో ఆయా మండలాల ఎంపీడీఓలు తమ లక్ష్యాలను సాధిం చేందుకు కృషి చేయాలని ఆదేశించారు. జిల్లాలో అనేకచోట్ల సిబ్బంది కొరతగా ఉన్నందున పనులు చేపట్టడంలో ఇబ్బందిగా ఉందని డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ ఆర్.శ్రీనివాసరావు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. సీసీ రోడ్ల నిర్మాణంపై పంచాయతీరాజ్ ఎస్ఈ జయరాజ్ మాట్లాడుతూ రూ.61.32 కోట్లతో జిల్లాలో 1430 పనులను పూర్తిచేసేందుకు అనుమతి పొందినట్లు తెలిపారు. జిల్లాలోని 253 గ్రామాలను ఆర్థిక సంవత్సరం చివరినాటికి బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు 35 వేల మరుగుదొడ్లు నిర్మిస్తున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు.
పంచాయతీ కార్యదర్శులుగా రండి..
జిల్లాలో ఖాళీగా 154 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను వివిధ శాఖల్లో ఉన్న సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమించుకునేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ రామాంజనేయులు డీపీఓ వీరయ్యను ఆదేశించారు. తొలుత సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు కొసనా మధుసూదనరావు మృతికి మౌనం పాటిం చారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ బి.సుబ్బారావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ గోపాలకృష్ణ, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓలు పాల్గొన్నారు.