ప్రారంభమైన అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు
హైదరాబాద్ : అంతర్జాతీయ వ్యవసాయ సదస్సు హైదరాబాద్‌లోని హైటెక్స్ ప్రాంగణం సోమవారం ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. వివిధ దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సుకు 9 నెలల క్రితం నుంచే సన్నాహాలు చేయనారంభించినా ప్రతినిధుల స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది.
నిర్వాహకులు మొదట చెప్పినట్లు ప్రధాని, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, బిల్‌గేట్స్ రావడం లేదు. చివరికి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి తారిఖ్ అన్వర్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణే కార్యక్రమాన్ని నడిపించే పరిస్థితి ఏర్పడింది.
మొత్తం 350 మంది ప్రతినిధులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. విదేశీ ప్రతినిధులే 350 మంది హాజరవుతారని తొలుత ప్రకటించారు. చివరకు వీరి సంఖ్య 33కు పరిమితమైంది. సభ్యత్వ నమోదు రుసుమును రూ.10,600 నుంచి రూ.5,000కు తగ్గించినప్పటికీ ప్రతినిధుల సంఖ్య పెరగలేదు.