ఒలింపిక్ బెర్త్ కోసం...
యాంట్‌వర్ప్ (బెల్జియం): మహిళల హాకీ జట్టుకు సువర్ణావకాశం.. 1980 తర్వాత ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో ఆడేందుకు కేవలం మరో అడుగు దూరంలో ఉంది. హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో భాగంగా ఐదు, ఆరు స్థానాల వర్గీకరణ మ్యాచ్‌లో భారత జట్టు నేడు (శనివారం) జపాన్‌తో ఆడనుంది.
ఈ మ్యాచ్‌లో నెగ్గితే వచ్చే ఏడాది రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్‌లో భారత్‌కు బెర్త్ ఖరారవుతుంది. ఓడితే పూర్తిగా ఒలింపిక్స్ అవకాశాలు లేవని చెప్పలేం. కానీ అనేక ఇతర సమీకరణాలపై ఆధారపడాల్సి వస్తుంది. మరోవైపు మహిళల హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్‌లో ప్రపంచ చాంపియన్స్ నెదర్లాండ్స్, దక్షిణ కొరియా మధ్య నేడు టైటిల్ పోరు జరుగనుంది. సెమీస్‌లో డచ్ జట్టు 5-1తో ఆసీస్‌పై, కొరియా 4-2తో షూటవుట్‌లో కివీస్‌పై నెగ్గింది.