అవగాహనతోనే అంతం
తలసేమియా... శరీరంలోని రక్తాన్ని క్షణం క్షణం బలహీనం చేసే వ్యాధి. దేశంలో ఏటా 10వేల మంది ఈ వ్యాధితో జన్మిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనే ఈ వ్యాధిగ్రస్తుల మరణాల సంఖ్య ఎక్కువగా నమోదవుతోంది. ఈ వ్యాధిలో చికిత్స కంటే నివారణ ముఖ్యమంటున్న డాక్టర్లు... తల్లిదండ్రుల అవగాహనతో ఈ రోగాన్ని దూరం చేసి పిల్లల ఆరోగ్యం కాపాడొచ్చని చెబుతున్నారు. గురువారం ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం...
- నేడు ప్రపంచ తలసేమియా దినోత్సవం
- చైతన్య లోపమే వ్యాధికి కారణమంటున్న నిపుణులు ప్రాంతాల్లోనే
- ఈ మరణాలు ఎక్కువ
ముంబై: నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా తలసేమియాతో జన్మిస్తున్న శిశువుల సంఖ్య పెరుగుతోంది. జన్యులోపం వల్ల రక్తహీనతతో పుట్టే ఈ బాలలకు నెలకు మూడు నాలుగుసార్లు రక్త మార్పిడి చేయాలంటే తల్లిదండ్రులకు తలప్రాణం తోకకు వస్తోంది. పిల్లలను పట్టుకొని ఆస్పత్రులు చుట్టూ తిరిగేసరికే సమయం అయిపోతోంది. ఇంతా చేసినా తరచూ వారు ఆనారోగ్యం బారిన పడటం తల్లిదండ్రులను వేధిస్తోంది. కాగా. దేశంలో ప్రతి ఏటా 10 వేల మంది చిన్నారులు తలసేమియాతో జన్మిస్తున్నారని, తల్లిదండ్రుల అవగాహన లోపమే ఇందుకు ప్రధాన కారణమవుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
‘ఈ వ్యాధి శరీరంలో ఐరన్ అధికమవడం, అంగవైకల్యం, గుండె సంబంధిత వ్యాధుల వంటి మరణానికి దారితీసే జబ్బులకు కారణమవుతోంది’ అని ముంబైలోని ఓ ఆస్పత్రి వైద్యుడు తెలిపారు. ఇలాంటి జన్యు సంబంధిత వ్యాధులు సంక్రమించకుండా ఉండాలంటే నిర్లక్ష్యం చేయకుండా గర్భిణులు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, జబ్బుపట్ల తల్లిదండ్రుల చైతన్యమే బిడ్డ ప్రాణాలను కాపాడగలుగుతుందని ఆయన చెప్పారు. తలసేమియా రక్త కణాలను బలహీనం చేయడమే కాకుండా నాశనం కూడా చేస్తుంది.
జన్యులోపంతో వచ్చే ఈ వ్యాధి ఎర్రరక్త కణాలకు ఆక్సిజన్ తీసుకెళ్లడానికి ప్రధాన అవసరమైన హిమోగ్లోబిన్ ప్రోటీన్ల తయారీపై ప్రభావం చూపుతుందని చౌదరీ వివరించారు. దీనిని తలసేమియా మేజర్ అంటామని, ఈ వ్యాధిగ్రస్త పిల్లలకు తరచూ రక్త మార్పిడి చేయాల్సి ఉంటుందని తెలిపారు. అలాంటి కేసుల్లో పిల్లలను పుట్టకుండా చేయడమే మంచిదని, పరీక్ష చేయించుకున్న తల్లిదండ్రులు ఆ గర్భం తీసేయించుకోవాలని చౌదరి సూచించారు. ఏదైనా అసాధారణంగా ఉన్నట్లు డాక్టర్లు చెబితే తల్లిదండ్రులు పూర్తి రక్త పరీక్ష చేయించుకోవాలన్నారు.
ఎముక మూలిగ/మూల కణ మార్పిడి ఈ వ్యాధిని పూర్తిగా తగ్గిస్తుందని, అయితేదేశంలో మూలకణ దాతల కొరత అధికంగా ఉందని, తమ ఆర్యోగంపై ప్రభావం చూపుతుందేమోననే అనుమానంతో మూల కణ దానానికి ఎవరూ ముందుకు రావడం లేదని చౌదరి తెలిపారు. ఇంకా ఇలాంటి సమస్యలను ఆదిలోనే అంతం చేయాలనుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న జంటలు పెళ్లికి ముందే జెనెటిక్ కౌన్సిలింగ్కు వెళ్తే మంచిదని సూచించారు. తల్లిదండ్రులు ముందుకొచ్చి మూలకణాల దానంతో హ్యూమన్ ల్యూకోసైట్ యాంటీజెన్(హెచ్ఎల్ఎ) నిల్వ చేయడం వల్ల సమాజంలోని ఎంత మందికి సహాయం చేసినవారవుతారని గుప్తా చెప్పారు.
శరీరంలోని అనేక అణువుల్లో హెచ్ఎల్ఏ ఒక రకమైన అణువు అని, ఇది శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలిపారు. అవయవ, మూలకణ మార్పిడికి ముందు దాత, గ్రహీతల కణజాలాలకు హెచ్ఎల్ఏ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. అవగాహన లోపం వల్ల తలసేమియాతో చనిపోతున్నవారి సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉందని, రక్త మార్పిడి సమయంలో కలుషితమైన రక్తం రోగులకు ఇవ్వడం వల్ల ఆ ఇన్ఫెక్షన్లు రోగులకు వస్తున్నాయని, కొన్నిసార్లు ఇవి అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం పాశ్చాత్య దేశాల్లోని 90 శాతం మంది తలసేమియా బాధితులు ఎక్కువ కాలం సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారు. ఇక మన దేశంలోని సగం మంది రోగులు బాల్యంలోనే చనిపోతున్నారు. మన దేశంతో పోల్చుకుంటే... మిగిలిన దేశాల్లో ఈ వ్యాధులపై అవగాహన ఎక్కువగా ఉందని,వైద్య పరీక్షల కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని మరో వైద్యుడు తెలిపారు.
అత్యంత ఖరీదైన వ్యవహారంగా ఉన్న ఇలాంటి వ్యాధుల విషయంలో పాశ్చాత్య దేశాల్లో వైద్య ఖర్చులను ప్రభుత్వాలు, బీమా సంస్థలు భరిస్తుండటం వారికి కలిసొచ్చే అంశమని తెలిపారు. మన దేశంలో కూడా ఇలాంటి వైద్య పరీక్షలు, చికిత్స, మందుల వంటి బాధ్యతను ప్రభుత్వాలుతీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.