భారత్లో కుబేరులు 1.98 లక్షల మంది
న్యూఢిల్లీ : భారత్లో మిలియనీర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. తాజాగా దేశంలో అత్యంత సంపన్నుల (హెచ్ఎన్డబ్ల్యూఐ) సంఖ్య 1.98 లక్షలుగా ఉన్నట్లు వరల్డ్ వెల్త్ రిపోర్ట్ 2015 నివేదికలో వెల్లడైంది. సంపన్నులు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ 11వ స్థానంలో నిల్చింది. క్యాప్జెమిని, ఆర్బీసీ వెల్త్ మేనేజ్మెంట్ ఈ నివేదికను రూపొందించాయి. దీని ప్రకారం చమురు ధరల పతనం, నిర్మాణాత్మకమైన ఎన్నికల ఫలితాలు తదితర అంశాలు గతేడాది సంపన్నుల సంపద మరింత పెరగడానికి దోహదపడ్డాయి. హెచ్డబ్ల్యూఎన్ఐ సంపద పరంగా ఆసియా పసిఫిక్లో ఆస్ట్రేలియాను దాటి భారత్ మూడోస్థానానికి ఎగబాకింది. 2013లో భారత్లో హెచ్డబ్ల్యూఎన్ఐల సంఖ్య 1,56,000 కాగా 2014లో ఇది 1,98,000కు పెరిగింది.
అత్యధిక హెచ్ఎన్డబ్ల్యూఐలు ఉన్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలోను (43,51,000 మంది), జపాన్ (24,52,000 మంది), జర్మనీ (11,41,000 మంది), చైనా (8,90,000 మంది) తర్వాత నాలుగు స్థానాల్లోనూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సంపన్నుల సంపదలో దాదాపు 60.3 శాతం సంపద టాప్ నాలుగు దేశాల హెచ్ఎన్డబ్ల్యూఐల వద్దే ఉంది. ఆర్థిక రంగం, స్టాక్ మార్కెట్ల పనితీరు మెరుగుపడటంతో గతేడాది ప్రపంచవ్యాప్తంగా 9,20,000 మంది మిలియనీర్లు కొత్తగా పుట్టుకొచ్చారు.
దీంతో అత్యంత సంపన్నుల సంఖ్య 1.46 కోట్లకు చేరింది. వీరందరి సంపద 56.4 లక్షల కోట్ల డాలర్లకు పెరింది. హెచ్ఎన్డబ్ల్యూఐల సంఖ్య పెరుగుదలలో ఆసియా పసిఫిక్ దేశాలు ముందున్నాయి. నిలకడైన వృద్ధి కొనసాగనున్న నేపథ్యంలో 2017 నాటికి ప్రపంచ దేశాల హెచ్ఎన్డబ్ల్యూఐల సంపదలో దాదాపు 10 శాతం భారత్, చైనా సంపన్నుల వద్దే ఉంటుందని నివేదిక అంచనా వేసింది.