అసంతృప్తిగా ఉంటే.. పోలీసు కాల్ వస్తుంది!
మీరు అసంతృప్తిగా ఉన్నారా? అయితే మీకు మేం కాల్ చేస్తాం అంటున్నారు దుబాయ్ పోలీసులు. 2021 నాటికి ప్రపంచంలోని టాప్ టెన్ సంతోషకరమైన నగరాల జాబితాలో చోటు సంపాదించే ఉద్దేశంతో దుబాయ్ పోలీసులు ఈ మేరకు కొత్త ఆన్లైన్ సర్వే చేపట్టారు. ఈ సర్వే ప్రకారం మీరు ఆనందంగా ఉన్నారా? మాములుగా ఉన్నారా? బాధగా ఉన్నారా? అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆన్లైన్ సర్వేలో ఎవరైనా తాము అసంతృప్తిగా ఉన్నట్టు ఆప్షన్ ఎంపిక చేస్తే.. వారికి పోలీసులు కాల్ చేసి మాట్లాడనున్నారు. వారి అసంతృప్తికి కారణాలు తెలుసుకోనున్నారు.
ఇప్పటికే దుబాయ్ చాలా రంగాల్లో పేరుగాంచింది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన కట్టడమూ ఇక్కడే ఉంది. ఈ నేపథ్యంలో ఆనందకరమైన నగరాల జాబితాలో అగ్రస్థానంలో ఉండాలని ప్రయత్నిస్తున్నది. అయితే ఇందుకు నిర్వహిస్తున్న ఈ సర్వేలో ఎవరైనా అసంతృప్తిగా ఉన్నామని చెప్తే వారికి పోలీసులు కాల్ చేయడం ఏమిటని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 'ద హ్యాపీనెస్ ఇండస్ట్రీ: హై ద గవర్న్మెంట్ అండ్ బిగ్ బిజినెస్ సోల్డ్ అస్ వెల్-బియింగ్' రచయిత విలియమ్ డేవిస్ ఈ సర్వేపై స్పందిస్తూ 'ఇది ప్రజలను భయపెట్టే సర్వేలా నాకు అనిపిస్తున్నది. ఎవరైనా పొరపాటున తాము అసంతృప్తిగా ఉన్నామంటే.. 'ఏంటి సంగతి' అని పోలీసుల నుంచి వారికి కాల్ రావడం ఒక రకంగా భయపెట్టేదే' అని పేర్కొన్నారు.