worlds oldest woman
-
ప్రేమవల్లే 119వ పుట్టిన రోజుకు సిద్ధమవుతున్నా..
అర్జెంటీనా: వంద సంవత్సరాలుమించి బతకడమే కష్టమని మొన్నటి వరకు అనుకోగా 110 ఏళ్లు కూడా బతికి ప్రపంచంలోనే అత్యధిక వయసు కలిగిన వ్యక్తులుగా రికార్డులు నెలకొల్పుతున్నవారు ఈ మధ్య ఎక్కువగానే కనిపిస్తున్నారు. ఇక తాజాగా, అర్జెంటీనాలోని ఓ బామ్మ మాత్రం ఏకంగా 118 ఏళ్లను పూర్తి చేసుకొని తన 119వ పుట్టిన రోజు కేకును కట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. అర్జెంటీనాలో ఇప్పటికీ ప్రభుత్వం నుంచి పెన్షన్ పొందుతున్న ఆ శతాధిక యోధురాలి పేరు సెలినా డెల్ కార్మెన్ ఒలియా. ఆమె బ్యూనస్ ఎయిర్స్ లో తన కుమారుడు అల్బర్టో, దత్తత తీసుకున్న కుమార్తె గ్లాడీతో ఉంటుంది. ఆమెకు పన్నెండు మంది సంతానం. ఆమె పేరిట ప్రపంచంలోనే అత్యధిక వయోధికురిలాగా కూడా రికార్డు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఫిబ్రవరి 15, 1897న ఆమె జన్మించిందని, ఆమెకు జనన నమోదు పత్రం కూడా ఉందని వివరించారు. ఈ సందర్భంగా ఆమె ఇంత సుదీర్ఘ కాలం జీవించడానికి గల కారణాలను పంచుకుంది. 'బాగా కష్టపడి పనిచేయడం, ఎక్కువగా నడవడంతోపాటు చుట్టూ ప్రేమతో నిండిన మనుషులు ఉండటం, పొగ, మద్యం అలవాటు లేకపోవడంవంటి కారణాలు నా జీవితాన్ని సుదీర్ఘంగా ఆరోగ్యంతో ఉంచాయి' అని సెలినా తెలిపింది. అయితే, తన సంతానం గురించి తెలిపిన ఆ బామ్మ తనకు ఎంతమంది మనవళ్లు మనవరాళ్లు ఉన్నారనే విషయం మాత్రం చెప్పలేకపోయింది. ఆమె ఇంట్లోని పిల్లల్లో కొందరు పాఠశాలకు వెళుతుండగా, మరికొందరు తమ సొంత కోళ్ల ఫారంలలో పనికి వెళుతుంటారు. -
111 ఏళ్ల తాతయ్య.. 115 ఏళ్ల బామ్మ!
లండన్: కలుషిత వాతావరణం, ఆహారం, పని ఒత్తిడి, ఆధునిక జీవనశైలితో కూడిన ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి సగటు వయసు ఎంత? ఓ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు జీవించగలడు. అన్నీ సవ్యంగా సాగితే వందేళ్లు బతకగలమా? వామ్మో అన్నేళ్లా అనే సందేహం రావచ్చు. ఈ మాట వినగానే ఆశ్చర్యపడేవారు ఎక్కువగా ఉండొచ్చు. ఏ డెబ్బై, ఎనబై (!) ఏళ్ల బతికితే అదే గొప్పగా భావించవచ్చు. కానీ ప్రపంచంలో జీవించివున్న అతిపెద్ద వయస్కుడు, అతిపెద్ద వయస్కురాలిని గురించి వింటే ఈ ఆశ చిగురించవచ్చు. ప్రపంచంలో జీవించిఉన్న అతిపెద్ద వయస్కుడిగా ఇటలీకి చెందిన వ్యక్తి రికార్డు సాధించాడు. ఆర్టురో లికాటా అనే వృద్ధుడు గిన్నెస్ బుక్లోకెక్కాడు. అతని వయసు ప్రస్తుతం 111 సంవత్సరాలా 302 రోజులు. లికాటా జనన, వివాహ ధ్రువపత్రాలను పరిశీలించిన అనంతరం అతణ్ని ప్రపంచ వృద్ధుడిగా గుర్తించారు. ఇక మహిళలలో జీవించిఉన్న అతిపెద్ద వయస్కురాలిగా జపాన్ బామ్మ నిలిచింది. మిసావో ఒకావా వయసు 115 ఏళ్లు. లికాటా కంటే ఆమె నాలుగేళ్ల ముందు జన్మించింది. 1898 మార్చిలో ఒకావా.. 1902 మేలో లికాటా జన్మించారు. లికిటా 19 ఏళ్ల వయసులోని సైన్యంలో చేరి 18 ఏళ్లు పనిచేశాడు. ఆయన భార్య 78 ఏళ్ల వయసులోనే 1980లో మరణించింది. వీరికి ఏడుగురు పిల్లలు, ఎనిమిది మంది మనవళ్లు, నలుగురు మునిమనవళ్లు సంతాన చక్రం. గిన్నిస్ బుక్ నిర్వాహకులు ప్రతి ఏటా ప్రపంచంలో అతిపెద్ద వయసు వారిని గుర్తించి సన్మానిస్తోంది. రికార్డుల ప్రకారం జీన్నె కామ్లెంట్ (ఫ్రాన్స్) అనే వ్యక్తి గరిష్టంగా 122 సంవత్సరాలా 164 రోజులు బతికాడు. ఆయన 1997లో మరణించాడు.