నాకా జంక్షన్లో గ్యాస్ లీకేజీ
సాక్షి, ముంబై: వర్లీ నాకా జంక్షన్ వద్ద గురువారం మధ్యాహ్నం గ్యాస్ లీకయ్యింది. దాంతో పరిసర ప్రాంత ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడున్న ప్రజలను ఖాళీ చేయించారు. మంటలు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. సమాచారం అందుకున్న మహానగర్ గ్యాస్ లిమిటెడ్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని లీకేజీని అరికట్టగలిగారు. వర్లీలోని సీఎన్జీ ఔట్లెట్లో సాంకేతిక లోపం వల్ల గ్యాస్ లీకేజీ అయ్యింది. వెంటనే గ్యాస్ సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ గ్యాస్ లీకేజీవల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్థానిక వర్లీ పోలీసులు చెప్పారు. అయితే లక్షల కేజీల గ్యాస్ గాలిలో కలిసిపోయిందని మహానగర్ గ్యాస్ కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా, గ్యాస్ లీకేజీ అయినట్లు తెలియగానే అక్కడ ఎవరూ పొగ తాగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. గ్యాస్ తీవ్రతను తగ్గించేందుకు అగ్నిమాపక సిబ్బంది లీకేజీపై నీటిని పిచికారి చేశారు. వర్లీనాకా జంక్షన్ కావడంతో వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటుంది. సాయంత్రం వరకు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో పరిస్థితులు మెరుగుపడ్డాయి. కాగా, ఈ ఘటన ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన గ్యాస్ దుర్ఘటనను జ్ఞప్తికి తెచ్చిందని స్థానికులు పేర్కొనడం గమనార్హం.