37 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన 'నిర్దోషి'
వాషింగ్టన్: అతడితో విధి అలా ఇలా కాదు ఓ రకంగా ఆటలాడుకుంది. చేయని నేరానికి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు జైలుశిక్ష అనుభవించి ... శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యాడు. అతడి పేరు జోసఫ్ స్లెడ్జ్. జైలు నుంచి విడుదలైన తర్వాత... స్వేచ్ఛ ఎంతో అద్భుతంగా ఉంటుందని అన్నాడు.
విషయం ఏమిటంటే.. జోసఫ్ స్లెడ్జ్ ఓ కారు చోరీ చేసి వెళ్తుండగా పోలీసులు పట్టుకుని, అతడి మీద కారు చోరీతో పాటు.. ఇద్దరిని హత్య చేసినట్లు కూడా నేరం మోపారు. అతడిని పోలీసులు కోర్టులో హాజరు పరచగా.... కోర్టు జైలుశిక్ష విధించింది. ఈ ఘటన 1978లో జరిగింది. ఈ కేసులో తాను నిర్ధోషినని జోసఫ్ నెత్తీనోరూ బాదుకున్నాడు. అయిన అతడి ఆవేదన అరణ్యరోదనే అయింది. ఎట్టకేలకు ఇన్నాళ్లకి అతడి నిర్దోషిత్వం నిరూపితం కావడంతో కొలంబస్ కౌంటీ జైలు నుంచి విడుదలై.. స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నాడు.