మళ్లీ బుల్లితెరపైకి షారుఖ్ ?
న్యూఢిల్లీ: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ మరోసారి టీవీ షోలో పాల్గొనేందుకు రెడీగా ఉన్నాడంటూ బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. అంతర్జాతీయంగా ప్రాముఖ్యం పొందిన గాట్ ట్యాలెంట్ షో ఆధారంగా ఓ హిందీ చానెల్ ప్రసారం చేసే షోను షారుఖ్ నిర్వహిస్తాడట. దీని గురించి సంబంధిత చానెల్ శుక్రవారం అధికారికంగా ప్రకటన చేయనుంది. షారుఖ్ యాంకర్‌గా వ్యవహరించబోయే విషయాన్ని తెలియజేయడానికి త్వరలో నిర్వహించబోయే కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. మరొక ఆసక్తికర విశేషం ఏమిటంటే గ్యాట్ ట్యాలెంట్, ది ఎక్స్ ఫ్యాక్టర్ వంటి షోలతో ఎంతో పేరుతెచ్చుకున్న టీవీ ప్రముఖుడు సైమన్ కోవెల్ కూడా షారుఖ్ షో ప్రకటన కోసం నిర్వహించే ఉత్సవంలో పాల్గొనేందుకు ముంబై వస్తాడని తెలిసింది.
ముంబై అంధేరీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ వేడుకలు నిర్వహిస్తారు. నిజానికి కోవెల్ మాదిరి లాంటి షో ‘ఇండియా ఈజ్ గాట్ ట్యాలెంట్’ పేరుతో ఇది వరకే ఓ కార్యక్రమం ప్రసారమవుతోంది. షారుఖ్ నిర్వహించబోయే షో వివరాలు మాత్రం ఇంత వరకు బయటకురాలేదు. హిందీ అగ్రహీరోల్లో ఒకడైన షారుఖ్ ఖాన్ తన నటనా జీవితాన్ని టీవీ షోలతోనే మొదలుపెట్టాడు. ఫౌజీ, సర్కస్ కార్యక్రమాల్లో నటించాడు. 22 ఏళ్ల క్రితం దీవానా అనే సినిమాలో తొలిసారిగా అవకాశం వచ్చింది. ఇటీవల కౌన్ బనేగా కరోడ్‌పతి, క్యా ఆప్ పాంచ్వీ పాస్ సే తేజ్ హై ?, జోర్ కా ఝట్కా షోలు నిర్వహించాడు. ఇక ఫరాఖాన్ తాజాగాతీస్తున్న హ్యాప్పీ న్యూఇయర్ మనోడి తాజా చిత్రం. ఇది ఈ ఏడాది దీపావళి పండుగకు థియేటర్లకు వస్తుంది. ఇది వరకు ఎస్ఆర్కే నటించిన చెన్నయ్ ఎక్స్‌ప్రెస్ రూ.100 వంద కోట్ల క్లబ్ సినిమాల్లో చేరింది.