నిర్మాత వై.హరికృష్ణ కన్నుమూత
ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు వై.హరికృష్ణ(74) శుక్రవారం రాత్రి 12 గంటల 30 నిమిషాలకు కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధ పడుతున్నారు. హరికృష్ణకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. నవయుగ పంపిణీ సంస్థలో చిరు ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన హరికృష్ణ... అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత స్థాయికి ఎదిగారు. తాను నమ్మిన వామపక్ష భావాలను వదలిపెట్టకుండా, సందేశంతో కూడిన చిత్రాలను నిర్మించారు.
లక్ష్మీచిత్ర ఫిలింస్ పతాకంపై టి.కృష్ణ దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘వందేమాతరం’, ‘దేవాలయం’ చిత్రాలు అటు అవార్డులను, ఇటు రివార్డులనూ సొంతం చేసుకున్నాయి. అలాగే... అరుణకిరణం, ఇన్స్పెక్టర్ ప్రతాప్, మమతల కోవెల లాంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారాయన. ఇదా ప్రపంచం, కల్యాణ తాంబూలం, పద్మావతి కల్యాణం చిత్రాలతో ప్రేక్షకులకు సందేశాలను అందించారాయన. జనాన్ని జాగృతం చేసే చిత్రాలను నిర్మించిన హరికృష్ణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన మరణం పట్ల తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, నిర్మాతల మండలి తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చాయి.