నేడు జిల్లాకు విజయమ్మ
సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారని వైఎస్సార్ సీపీ కేంద్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. తూర్పుగోదావరిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముగించుకుని ఆమె జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారు.
ఆ నియోజకవర్గం నక్కపల్లి వద్ద ఒడ్డిమెట్ట గ్రామానికి మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుని అక్కడి బాధితులను పరామర్శిస్తారు. అనంతరం మెట్టపల్లి వీవర్స్ కాలనీ, యలమంచిలి, కశింకోట మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇవ్వనున్నారు. అనంతరం ఆమె విశాఖలో రాత్రి బస చేస్తారు. బుధవారం ఉదయం విశాఖ నుంచి బయలుదేరి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు.