రోడ్డు ప్రమాదంలో తల్లి, కూతురు దుర్మరణం
-మరో ఇద్దరు పరిస్థితి విషమం
భువనగిరి: యాదాద్రి-భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లికూతురులు అక్కడికక్కడే మరణించగా ఒకే కుటుంబానికి చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వలిగొండ మండలంలోని వెల్వర్తి శివారులోని దుర్గమ్మ ఆలయం సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని రెడ్లరేపాకకు చెందిన చుక్క నారాయణ కూతురుకు సంబంధం మాట్లాడడానికి మొగిలిపాకకు ఆటోలో వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఆటో ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో రెడ్లరేపాకకు చెందిన ఆటో బోల్తా పడి అందులో ప్రయాణిస్తున్న చుక్క యాదయ్య భార్య ఎల్లమ్మ (55), ఆమె కూతురు పహిల్వాన్‌పురంకు చెందిన దుబ్బ స్వామి బార్య దుబ్బ పద్మ (35) అక్కడికక్కడే మృత్యువాత పడగా ఆటోలో ఉన్న దుబ్బ పోషమ్మ, కందుల రాములమ్మ, చుక్క మమత, చుక్క పుష్పలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108లో భువనగిరి ఏరియా వైద్యశాలకు తరలించారు. పోషమ్మ, రాములమ్మ పరిస్థితి విషమంగా ఉంది.
మరో మహిళ చుక్క మమత, డ్రైవర్ చుక్క పోషయ్యను మండలకేంద్రంలోని లక్ష్మణ్ ఆస్పత్రికి, చుక్క నారాయణ, ఆయన భార్య పరదేశమ్మ , కందుల నర్సింహ, దుబ్బ లక్ష్మమ్మ, చుక్క గౌరమ్మలను మండలకేంద్రంలోని సాయికిరణ్ వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు మృతదేహాలను పోస్ట్‌మార్టమ్ నిమిత్తం రామన్నపేట వైద్యశాలకు తరలించారు. ఢీ కొట్టిన ఆటో వెల్వర్తికి చెందినదిగా పలువురు అనుకుంటున్నారు.