గాడ్ గా మారిన గ్యాంగ్స్టర్!
ఒకప్పుడు అది బార్..జపాన్ రాజధాని టోక్యో శివార్లలోని కవాగుచి నగరంలో ఆ బార్ ఉంటుంది. దాని పేరు ఇప్పుడు 'జూన్ బ్రైడ్'గా మారింది. బయటినుంచి చూస్తే ఈ బార్ ఉన్న భవనం పెద్దగా ఏమీ మారలేదు. కానీ లోపలికి వెళ్లి చూస్తేనే.. ఎంతో మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు బార్ గర్ల్స్ నృత్యాలు చేసే ప్రదేశంలో ఇప్పుడు చక్కని ప్రశాంతమైన వేదిక ఉంటుంది. దాని ఎదురుగా వరుసలో పేర్చిన కూర్చీలు అందంగా కనిపిస్తాయి. చుట్టూపక్కల ప్రజలు మౌనంగా ఆ విశాలమైన గదిలోకి వచ్చి కూర్చుంటారు. ఇందులోని చాలామంది ఒకప్పుడు ఈ బార్ కు తాగడానికి వచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు అందుకు రాలేదు. ఇప్పుడు వాళ్లకు ఇదొక ఆధ్యాత్మిక ధామం. భక్తి, ముక్తి గురించి గురుబోధనలు విని పులకించే ప్రదేశం. ఇంతలోనే వారందరూ గురువుగారు అని పిలుచుకునే సెన్సీ తాత్సుయా షిండో రానే వచ్చారు. ప్రసన్నవదనంపై చిరు దరహాసం, ఎదురుగా కూచ్చున్న భక్తుల కళ్లలో వెలుగు. అతీతమైన శక్తి కూడగట్టుకొని భక్తి, ఆధ్యాత్మిక బోధనలను షిండో చేస్తుంటే ఎదురుగా ఉన్నవారు తన్మయత్వంలో మునిగిపోయారు.
44 ఏళ్ల షిండో చూడటానికి చిన్న వయస్కుడిగానే కనిపిస్తారు. ముఖంపై చెరుగని చిరునవ్వు. చుట్టూ వందమంది శిష్యులు. ఎప్పుడు ఛలోక్తులు విసురుతూ నవ్వుతూ కనిపిస్తారు. తన చీకటి గతం గురించి కూడా జోకులు వేస్తుంటారు. 'ఒకప్పుడు మేం శత్రువులం. ఒకరినొకరు కాల్చుకునేవాళ్లం. ఇప్పుడు మేమంతా కలిసి ఒకే దేవుడిని స్తుతిస్తున్నాం' అంటారు షిండే. ఇప్పుడు పాస్టర్ గా మారి ఆధ్యాత్మిక వేత్త అయిన షిండే ఒకప్పుడు గ్యాంగ్ స్టర్. 17 ఏళ్ల ప్రాయంలోనే క్రూరమైన జపనీస్ మాఫియా ప్రపంచం 'యాకుజా'లోకి ఆయన అడుగుపెట్టారు. ఇప్పుడు తన శిష్యులుగా ఉన్న పలువురు ఒకప్పటి తన మాఫియా గ్యాంగ్ లో అనుచరులే. మాఫియాలో విచ్చలవిడి ధనం సంపాదించే అవకాశముండటం, విలాసవంతమైన జీవితం, అందాలపై వ్యామోహం తనను అటువైపు నడిపించాయని, యుక్తప్రాయంలో చెడ్డవ్యక్తులే తనకు హీరోలుగా కనిపించేవారని ఆయన గుర్తుచేసుకుంటారు.
కటోరమైన నేర ప్రపంచమైన యాకుజా పట్ల టీనేజ్ యువత పెద్ద సంఖ్యలో ఆకర్షితులయ్యేవాళ్లు. చెల్లాచెదురైన ఇతర కుటుంబాల నుంచి వచ్చిన యువతలాగే షిండో కూడా ఈ మాఫియాకు ఆకర్షితుడయ్యాడు. ఈ చీకటి ప్రపంచంలోని వ్యక్తుల విధేయత, సోదరభావం ఉండేది. అయితే, ఈ అండర్ వరల్డ్ లోకి లోతుగా వెళ్లేకొద్ది తాను చెల్లిస్తున్న రక్తపు మూల్యం అతనిపై తీవ్ర ప్రభావం చూపింది.
'నా బాస్ హతమయ్యాడు. ఆధిపత్య పోరాటంలో ప్రజలు పెద్దసంఖ్యలో చనిపోయారు. కాళ్లూ,చేతులు కోల్పోయారు. నాతోపాటు మాదక ద్రవ్యాల వ్యాపారం చేసిన ఓ వ్యక్తి మత్తుమందు బారిన పడి చనిపోయాడు. ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. ఎన్నో మరణాలు,ఆకస్మిక మరణాలు చూశాను. నా మార్గదర్శిని కూడా నా కళ్లెదుటే పొడిచి చంపారు' అని షిండో తన గతాన్ని గుర్తుచేసుకుంటారు. 22 ఏళ్ల ప్రాయంలోనే పలుసార్లు అరెస్టయి మూడుసార్లు జైలుపాలైన షిండో జీవితంలో క్రమంగా పరివర్తన మొదలైంది. 32 ఏళ్ల వయస్సులో ఓ సహచర వ్యక్తితో ఓ ఏడెనిమిదేళ్లు గడిపారు. ఈ ఏకాంతవాసంలో బైబిల్ చదువుతుండగా తనకు దేవుడు దర్శనమిచ్చాడని ఆయన చెప్తారు. అలా ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ.. ఆధ్మాత్మిక బోధనలు చేస్తూ ఒక దశాబ్దకాలంగా ఆయన దేవుడి మనిషిగా మారిపోయారు. ఆయన నమ్మకస్తులైన అనుచరులు ఆయనను దేవుడిగానే కొలుస్తారు. ప్రతి ఏడాది ఆయన ఆధ్మాత్మిక బోధనలు వినే భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇటీవల యాకుజా మాజీ సభ్యుడు, మాజీ గ్యాంగ్ స్టర్ హిరో కూడా తాజాగా ఆయన శిష్యుడిగా మారిపోయాడు. ఐదేళ్లు అజ్ఞాతంలో ఉన్న గ్యాంగ్ స్టర్ హిరో ఇప్పుడు పూర్తిగా ఆధ్మాత్మిక బాట పట్టారు. ఒకప్పుడు జపాన్ లో బలంగా ఉన్న అండర్ వరల్డ్ ప్రపంచం యాకుజా కూడా ఇటీవలికాలంలో క్రమంగా క్షీణించిపోతున్నది.