దళితులపై దాడులు అమానుషం
చించినాడ (యలమంచిలి): స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు గడచినా ఇప్పటికీ దళితులపై దాడులు జరగడం అమానుషమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బీవీ రాఘవలు ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళుతున్న ఆయన మార్గమధ్యలో చించినాడలో కొంతసేపు ఆగారు. ఈ సందర్భంగా గ్రామంలోని అమరవీరుల స్థూపం వద్ద పార్టీ జెండా ఎగురవేసి అనంతరంlకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనత వల్లే దళితులపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.
దళితుల రక్షణకు ఎన్ని చట్టాలున్నా ప్రభుత్వ సహకారం లేనిదే ఉపయోగం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీలు వారు చెప్పిన మతాన్నే ఆరాధించాలని, వారు తినే ఆహారాన్నే తినాలనే విధంగా ప్రవర్తించడం అమానుషమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రాష్ట్రం ఆర్థిక లోటులో ఉందని చెబుతూనే గోదావరి, కృష్ణ పుష్కరాలకు రూ.కోట్లు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. పుష్కరాలకు తాము వ్యతిరేకం కాదని క్రైస్తవులు, ముస్లింల పండగలను కూడా ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలు అన్ని మతాల ఆచార వ్యవహారాలను సమానంగా గౌరవించాలనే సంగతిని గుర్తించాలని చెప్పారు. మాజీ ఎమ్మెల్యేలు రుద్రరాజు సత్యనారాయణరాజు (ఆర్ఎస్), దిగుపాటి రాజగోపాల్, జిల్లా నాయకులు బి.బలరాం, సర్పంచ్ పెచ్చెట్టి సత్యనారాయణమ్మ, సొసైటీ అధ్యక్షుడు కేతా సూర్యారావు, పార్టీ మండల కార్యదర్శి బాతిరెడ్డి జార్జి, దేవ సుధాకర్ పాల్గొన్నారు.