35 శాతం వృద్ధి లక్ష్యం: యమహా
న్యూఢిల్లీ: ఈ ఏడాది అమ్మకాల్లో 35 శాతం వృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని యమహా మోటార్ ఇండియా సేల్స్ కంపెనీ (వైఎంఐఎస్) వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియన్ గురువారం తెలిపారు. గత ఏడాది 4.6 లక్షల వాహనాలను విక్రయించామని, ఈ ఏడాది 6.2 లక్షల వాహనాలు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. గత ఏడాది 1.5 లక్షల స్కూటర్లను అమ్మామని, ఈ ఏడాది 2.8 లక్షల స్కూటర్లను విక్రయించాలనేది లక్ష్యమని తెలిపారు.
టైర్ టూ నగరాల్లో తమ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకోనున్నామని, టైర్ 3 నగరాలపై దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. పిల్లల కోసం ఒక భద్రతా కార్యక్రమం, యమహా చిల్డ్రన్ సేఫ్టీ ప్రోగ్రామ్(వైసీఎస్పీ)ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. పిల్లలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పాఠశాలల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మస్కట్‌ను ఆవిష్కరించామని పేర్కొన్నారు. త్వరలో కుటుంబమంతా వినియోగించుకునే స్కూటర్‌ను మార్కెట్లోకి తెస్తామని వివరించారు. తామందిస్తున్న ఎఫ్‌జడ్, ఫేజర్, ఆర్15 మోటార్ బైక్‌లకు చిన్న నగరాల్లో కూడా మంచి స్పందన లభిస్తోందని వివరించారు.