'చనిపోతే పెన్షన్ భార్యకే.. తల్లికి రాదు'
న్యూఢిల్లీ: చనిపోయిన ఓ వ్యక్తికి సంబంధించి ఫ్యామిలీ పెన్షన్ విషయంలో అత్త కోడళ్ల మధ్య మొదలైన వివాదాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించింది. ఫ్యామిలీ పెన్షన్ మాత్రం చనిపోయిన వ్యక్తి భార్యకు మాత్రమే వస్తుందని, అతడి తల్లి ఆ పెన్షన్ తీసుకునేందుకు అర్హురాలు కాదని తేల్చింది. దాదాపు పాత చట్టాలను తిరగేయించిన ఈ కేసు హర్యానాలో చోటుచేసుకుంది. హర్యానాలో యశ్ పాల్ అనే ఉద్యోగి చనిపోయాడు. అతడికి ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. అయితే, ఈ పెన్షన్ తనకే వస్తుందని అతడి తల్లి డిమాండ్ చేయగా తనకే వస్తుందని భార్య చెప్పింది. ఈ వివాదం కాస్త కోర్టు వరకు వెళ్లింది.
తొలుత హైకోర్టుకు వెళ్లగా అక్కడ తల్లికి 50శాతం పెన్షన్ ఇవ్వాలని చెప్పారు. చివరకు ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. అయితే, పెన్షన్ అనేది చనిపోయిన వ్యక్తి ఆస్తిగా భావించి పంచలేమని, అది బాధితుడి భార్యకు మాత్రమే అందుతుందని, తల్లికి ఇవ్వడం కుదరదని చెప్పింది. కుమారుడు వద్ద మిగిలిపోయిన స్థిరాస్తి ఉంటే మాత్రం తల్లికి 50శాతం ఇవ్వొచ్చని చెప్పింది.
'కుటుంబ భృతి పథకం ప్రకారం వితంతువు (చనిపోయిన వ్యక్తి భార్య) మాత్రమే చనిపోయిన వ్యక్తి కుటుంబానికి చెందిన వ్యక్తి అవుతుంది. ఆమెకు మాత్రమే పెన్షన్ వస్తుంది. చనిపోయిన వ్యక్తి తల్లికి పెన్షన్ పొందేందుకు ఏమాత్రం అర్హత లేదు. ఒక వేళ చనిపోయిన యశ్ పాల్ వద్ద ఏవైనా ఆస్తులు ఉంటే మాత్రం వాటిని అత్తాకోడళ్లకు పంచి ఇవ్వొచ్చు' అని సుప్రీం వ్యాఖ్యానించింది.