సంతోషం సమాధి
=విషాదం నింపిన కొత్త సంవత్సరం వేడుకలు
=కాటేసిన అలల రక్కసి
=ముగ్గురి మృతి, ఒకరి గల్లంతు
=మృతుల్లో ఇద్దరు ఆటోడ్రైవర్లు
=కుప్పకూలిన కుటుంబ సభ్యులు
=నెల్లూరు జిల్లాలో రెండు ఘటనలు
తోటపల్లిగూడూరు, వాకాడు, న్యూస్‌లైన్: మదనపల్లెకు చెందిన లిఖిత్కుమార్రెడ్డి(17), సతీష్‌రెడ్డి (18) నెల్లూరులోని ఓ ప్రయివేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు కళాశాల నిర్వాహకుల అనుమతితో లిఖిత్కుమార్రెడ్డి, సతీష్‌రెడ్డి, దినేష్, శివచైతన్య, జశ్వంత్, అనిల్ మంగళవారం కళాశాల నుంచి బయటకు వచ్చారు. ఆ రోజంతా నెల్లూరులో సరదాగా గడిపారు. బుధవా రం తోటపల్లిగూడూరులోని కోడూరు బీచ్‌కు వచ్చా రు. సముద్రంలో దిగి స్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతయ్యారు. స్థానికులు గమనించి లిఖిత్కుమార్రెడ్డిని బయటకు తీశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని నారాయణ వైద్యశాలకు తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లిఖిత్కుమార్రెడ్డి తల్లిదండ్రులు వెంటనే మృతదేహాన్ని మదనపల్లెకు తీసుకెళ్లిపోయారు. సతీష్‌రెడ్డి ఆచూకీ కోసం రాత్రి వరకు గాలింపు చర్యలు కొనసాగాయి. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
తూపిలిపాళెంలో ఇద్దరి మృతి
రేణిగుంట, పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు విహారయాత్రగా నెల్లూరు జిల్లాలోని తూపిలిపాళెం బీచ్‌కు బుధవారం వెళ్లారు. వీరిలో రేణిగుంట ప్రాంతానికి చెందిన నూరుల్లా బాబు(28) అలలో కొట్టుకుపోతుండగా పక్కనే స్నానం చేస్తున్న శ్రీకాళహస్తి బీపీ అగ్రహారానికి చెందిన మునిశేఖర్(25) కాపాడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతనూ మునిగిపోయాడు. కొంతసేపటి తర్వాత ఇద్దరి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. మునిశేఖర్ అవివాహితుడు. నూరుల్లాబాబుకు ఏడాది క్రితమే పెళ్లయింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీ సులు బాలిరెడ్డిపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
భార్య ఆరు నెలల గర్భిణి
రేణిగుంట బుగ్గవీధికి చెందిన ఖాదర్‌బాషా, నసీమాల ఏకైక కుమారుడు నూరుల్లాబాబు. ఇతని భార్య ప్రస్తుతం ఆరు నెలల గర్భిణి. నూరుల్లాబాబు ఓ ప్రయివేటు ఏజెన్సీలో ఆటో డ్రయివర్‌గా పనిచేస్తున్నాడు. రేణిగుంట, శ్రీకాళహస్తికి చెందిన 12 మంది మిత్రులతో కలసి కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకునేందుకు నెల్లూరు జిల్లాలోని తూపిలిపాళెం బీచ్‌కు వెళ్లాడు. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయాడు. మరణవార్త విన్న కుటుంబసభ్యులు, బంధువులు గుండెలు బాదుకుని రోదించారు.
ఆధారం కోల్పోయిన కుటుంబం
శ్రీకాళహస్తిలోని బీపీ అగ్రహారానికి చెందిన వెంకటరామయ్య, వల్లెమ్మల ఏకైక కుమారుడు మునిశేఖర్. వెంకటరామయ్య ఇటీవల మృతి చెందాడు. వృద్ధాప్యం కారణంగా కూలికి వెళ్లలేని స్థితిలో వల్లెమ్మ రెండేళ్లుగా ఇంటి పట్టునే ఉంటోంది. మునిశేఖర్ చెల్లెలు లక్ష్మికి వివాహమైంది. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న మునిశేఖర్ ఆదాయమే కుటుంబానికి ఆధారం. నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు స్నేహితులతో వెళ్లిన అతను ఇక లేడన్న విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు జీర్ణించుకోలేకున్నారు. మృతదేహాన్ని శ్రీకాళహస్తికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కొత్త బట్టల్లో చూసుకోకపోతిమే
నిమ్మనపల్లె మండలం బోడిమల్లయ్యగారిపల్లెకు చెందిన వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ కూరపర్తి సదాశివారెడ్డి, జ్యోతి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో మొదటి కుమారుడు లిఖిత్కుమార్రెడ్డి. నెల్లూరులో చదువుతున్న ఇతను బుధవారం నాడు కోడూరు బీచ్‌లో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలియడంతో బోడిమల్లయ్యగారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. ‘కొత్తబట్టలు పంపిస్తే చేరినాయని ఫోన్ చేసి ఎంతో సంతోషంగా మాట్లాడావే.. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశావే.. ఇంతలోనే మమ్మల్ని వదిలి వెళ్లిపోయావా నాయనా’ అంటూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవడం గ్రామస్తులను కంటతడి పెట్టిం చింది. కొత్త బట్టల్లో ఎలా ఉన్నావో చూసే అదృష్టమూ మాకు దక్కలేదే.. మేమేం పాపం చేశాం నాయనా అంటూ తల్లిదండ్రులు రోదించారు. వీరిని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు.
కుప్పకూలిన కుటుంబ సభ్యులు
కురబలకోట మండలం మద్దిరెడ్డిగారిపల్లెకు చెందిన బైసాని సతీష్‌రెడ్డి బీచ్‌లో గల్లంతైన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కుప్పకూలారు. సమాచారం అందగానే సతీష్‌రెడ్డి తండ్రి గోపాల్‌రెడ్డి, బంధుమిత్రులు సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. గోపాల్‌రెడ్డికి సతీష్‌రెడ్డి ఒక్కడే కుమారుడు. చదువులో రాణిస్తున్నాడు. ఇంతలోనే కుటుంబ సభ్యులకు దుర్వార్త చేరింది.