వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే : పీరియడ్స్ పరిశుభ్రత ముఖ్యం, లేదంటే చాలా ప్రమాదం
ఈ రోజు మే నెల 28వ తేదీ! ఈ రోజుకో ప్రత్యేకత ఉందండోయ్! అంతర్జాతీయంగా మెనుస్ట్రువల్ హైజీన్ డేగా జరుపుకుంటారు. మహిళల నెలసరి సమయంలో పరిశుభ్రత పాటించాల్సిన అవసరం, పాటించకపోతే వచే ప్రమాదాల గురించి అందరిలో అవగాహన కల్పించడం దీని లక్ష్యం. అలాగే.. నెలసరి నిర్వహణకు సంబంధించిన ఉత్పత్తులు అందరికీ, వీలైనంత చౌకగా అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కూడా ఈ రోజున ప్రయత్నాలు, చర్చలు జరుగుతాయి. పాఠశాలల్లో ఆడపిల్లలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు పంచిపెట్టినా.. మరే ఇతర కార్యక్రమం ద్వారానైనా ఆరోగ్యకరంగా రుతుస్రావ ప్రక్రియ పూర్తయ్యేందుకు తీసుకుంటున్న చర్యలే. ఓకే.. అంతా బాగానే ఉంది కానీ.. అసలు ఈ వరల్డ్ మెనుస్ట్రువల్ డే అనేది ఎలా ఆచరణలోకి వచ్చిందో మీకు తెలుసా? నెలసరి సమయంలో పరిశ్రుభత పాటించకపోవడం ఎంత ప్రమాదకరమో మీకు అవగాహన ఉందా? ఆలస్యమెందుకు తెలుసుకుందాం రండి...ఆవిర్భావమిలా...జర్మనీకి చెందిన స్వచ్ఛంద సంస్థ ‘వాష్’ 2013లో ఏటా మే 28వ తేదీని వరల్డ్ మెనుస్ట్రువల్ హైజీన్ డేగా జరుపుకోవడం మొదలు పెట్టింది. రుతుస్రావం అనే అంశం ఏదో గుసగుసలాడుకునేది మిగిలిపోరాదని, అసంబద్ధ, మూఢవిశ్వాసాలతో కూడిన సామాజిక కట్టుబాట్ల నుంచి మహిళలు బయటపడాలన్న లక్ష్యంతో దీన్ని మొదలుపెట్టారు. అలాగే ప్రభుత్వాధినేతలు, అధికారులు ఈ అంశానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు తీసుకునేలా ఒత్తిడి తేవడమూ ఒక లక్ష్యమే. మహిళల్లో నెలసరి రుతుచక్రం 28 రోజులపాటు నడుస్తుంది కాబట్టి రుతుస్రావం ఐదు రోజులు కొనసాగుతుంది కాబట్టి ఏటా ఐదవ నెల 28వ తేదీన హైజీన్ డేను జరుపుకునేలా చర్యలు తీసుకున్నారు. పరిశుభ్రతతో ఆరోగ్య రక్షణ...సౌకర్యాల లేమి, సామాజిక, ఆర్థిక కారణాల రీత్యా లక్షలాది మంది అమ్మాయిలు, మహిళలు రుతుస్రావం సమయంలో పరిశుభ్రతను పాటించలేకపోతున్నారు. ఫలితంగా ఎన్నో నివారించదగ్గ రోగాల బారిన పడాల్సి వస్తోంది. పరిశుభ్రత పాటించకపోవడం వల్ల మూత్రాశయ నాళంతోపాటు పునరుత్పత్తి అవయవాలు కూడా ఇన్ఫెక్షన్లకు గురవుతాయి. ఇవి కాస్తా దీర్ఘకాలంలో పిల్లలు పుట్టకపోయేందుకూ, కాన్పు సమయంలో సమస్యలకు దారితీయవచ్చు. రుతుస్రావ సమయంలో జననేంద్రియ ప్రాంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం, తరచూ దురద, పొక్కుల్లాంటివి ఏర్పడేందుకు కారణమవుతుంది. శానిటరీ ప్యాడ్లను మార్చుకునే సందర్భంలో చేతులను కూడా బాగా శుభ్రం చేసుకోవడం ద్వారా హెపటైటిస్-బీ, థ్రష్ వంటి రోగాలను నివారించవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఎక్కువ సేపు ఒకే ప్యాడ్ ధరించడం: మహిళలు 6-8 గంటలకోసారి శానిటరీ న్యాప్కిన్లను మార్చుకోవాలి. లేదంటే దద్దుర్లు, ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.చేతులు కడుక్కోకపోవడం: శానిటరీ నాప్కిన్లను మార్చే ముందు, మార్చిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. లేదంటే ఈస్ట్ ఇన్ఫెక్షన్లు లేదా హెపటైటిస్ బికి దారి తీస్తుంది.వెనుక నుంచి ముందుకి కడగడం: రుతుస్రావం సమయంలో జననేంద్రియ ప్రాంతాలను శుభ్రం చేసుకునేందుకూ ఒక పద్ధతిని పాటించాలి. ముందు నుంచి వెనక్కు కడగడం అవసరం. ఇందుకు భిన్నంగా చేయడం వల్ల హానికారక బ్యాక్టీరియా పేవుల్లోకి చేరే అవకాశాలు పెరుగుతాయి.రుతుస్రావం సమయంలో భరించలేని నొప్పి, వికారం వాంతులు లాంటివి లక్షణాలు కనిపించినపుడు, వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. తగిన విశ్రాంతి తీసుకుంటూ, మంచి ఆహారం తీసుకోవాలి.