ఆరోగ్యకరమైన ఉత్పత్తులే నేటి కొలమానం
ఏడిద (మండపేట) :
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులకు రైతులు అధిక ప్రాధాన్యమివ్వాలని వ్యవసాయశాఖ జేడీ కేవీఎస్ ప్రసాద్ అన్నారు. 1990 నాటికి అధిక దిగుబడులు సాధించడం కొలమానం కాగా ప్రస్తుతం ఆరోగ్యకరమైన ఉత్పత్తులే అన్నారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం మండలంలోని ఏడిద వచ్చిన జేడీ ప్రసాద్ రైతులతో సమావేశమయ్యారు. అవసరాలకు అనుగుణంగా ఎరువులు, పురుగు మందులు వాడాలని సూచించారు. నిరే్ధశించిన మోతాదు, పిచికారిలోను జాగ్రత్తలు పాటించాలన్నారు. తెగుళ్లు, పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడే అధిక గాఢత కలిగిన పురుగు మందులను చివరి అస్త్రంగా వాడాలని జేడీ ప్రసాద్ రైతులకు సూచించారు. ప్రాకృతిక సాగుపై ఏడీఏ సీహెచ్కేవీ చౌదరి రైతులకు వివరించారు. సబ్సిడీపై మరిన్ని పవర్టిల్లర్లు, టార్ఫాలిన్లు కావాలని రైతులు కోరారు. ఎంఏఓ బి.రవి, ఆత్మ బీటీఎం డాక్టర్ బాబు, ఏటీఎం సాయి, ఎంఈఓలు రవివర్మ, చంద్రశేఖర్, రైతులు బలుసు అబ్బు, మేకా జేజిబాబు పాల్గొన్నారు.