'సీఎం పదవే కేసీఆర్ రాజకీయానికి ఉరితాడు'
ఎల్కతుర్తి: తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్న కేసీఆర్ ఇప్పుడు మాటమార్చి ప్రజలను మోసం చేస్తున్నాడని, గడీల పాలన కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాడని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. కేసీఆర్ ద్వారానే తెలంగాణ సాకారమైందని, రాష్ట్ర పునర్నిర్మాణం ఆయనతోనే సాధ్యమని ఆ పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు కేసీఆరే ముఖ్యమంత్రిగా ఉండాలనే సంకేతాలన్నారు. దళితుల్లో ముఖ్యమంత్రి పదవికి సమర్థులు లేరని కేసీఆర్ భావిస్తే అదే విషయం వెల్లడించాలని, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చెందిన వారిని సీఎంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
సామాజిక తెలంగాణే లక్ష్యంగా మహాజన సోషలిస్టు పార్టీ ఈ నెల 25న వరంగల్లో మహాజన గర్జన సభను నిర్వహిస్తోందని, ఆలోపే ముఖ్యమంత్రి పదవిపై స్పష్టమైన నిర్ణయాన్ని కేసీఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ముఖ్యమంత్రి పదవే కేసీఆర్ రాజకీయానికి ఉరితాడుగా మారుతుందని, ఆత్మగౌరవం కోసం టీఆర్ఎస్ను వెంటాడుతామని హెచ్చరించారు. తాము సామాజిక న్యాయానికి కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేస్తామని, మద్దతిచ్చే పార్టీలను కలుపుకుని ముందుకు సాగుతామని చెప్పారు. ఈ నెల 25, 26 తేదీల్లో తమ ప్రణాళికలను ప్రకటిస్తామన్నారు.