Yellam Goud
-
దాదాపు 50లక్షల సెటిల్ మెంట్లు చేశాడు
హైదరాబాద్: నకిలీ కరెన్సీ నోట్ల ముఠా కాల్పుల కేసులో ప్రధాన నిందితుడు ఎల్లంగౌడ్‌ను సైబరాబాద్ పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈమేరకు ఇవాళ సైబరాబాద్ కమిషనర్ ఎల్లంగౌడ్‌ను విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎల్లంగౌడ్‌పై తెలంగాణలో 15, కర్ణాటకలో 3 కేసులు ఉన్నాయని తెలిపారు. కాగా ప్రాణాలకు తెగించి ముఠాను పట్టుకునేందుకు యత్నించిన ఎస్ఐ వెంకటరెడ్డిని ఈ సందర్భంగా సత్కరించారు. ఈ నెల 14న శంషాబాద్ ఎన్కౌంటర్లో చైన్‌స్నాచర్ శివ మృతి చెందిన సందర్భంగా కమిషనర్ ఎల్లం గౌడ్‌కు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో కర్ణాటకకు పారిపోయిన ఎల్లంగౌడ్ మెదక్ జిల్లాకు చెందిన ఓ న్యాయవాది, బీజేపీ నేతతో కలసి సైబరాబాద్ పోలీసుల ఎదుట మంగళవారం రాత్రి వచ్చి తుపాకీ సహా లొంగిపోయాడు. నకిలీ నోట్ల తయారీ ముఠాలోని మెదక్ జిల్లా సిద్దిపేటకు చెంది ముస్తఫా, శ్రీకాంత్, ఎల్లంగౌడ్‌ను పట్టుకునేందుకు అదే ముఠాకు చెందిన రఘు, నరేష్లతో బాలానగర్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ వెంకట్‌రెడ్డి తన సిబ్బందితో కలిసి ఈ నెల 1న మజీద్‌పూర్ చౌరస్తా వద్ద డెకాయి ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లం గౌడ్ చేతిలో కానిస్టేబుల్ ఈశ్వర్రావు కత్తిపోట్లకు గురై మృతి చెందగా.. వెంకట్‌రెడ్డిపై కత్తితో దాడి చేసిన మస్తాన్ పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. అప్పటి నుంచి పరారీలో ఉన్న ముఠా నాయకుడు ఎల్లంగౌడ్‌ను పట్టుకునేందుకు కమిషనర్ సీవీ ఆనంద్ నాలుగు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దీంతో అతను కర్ణాటకకు పారిపోయాడు. అనంతరం కమిషనర్ హెచ్చరికలతో న్యాయవాదితో వచ్చి లొంగిపోయాడు. -
'ఆత్మరక్షణార్థమే కాల్పులు జరిపా'
హైదరాబాద్: నకిలీనోట్ల ముఠా చేతిలో గాయపడి చికిత్స అనంతరం కోలుకున్న ఎస్.ఐ.వెంకటరెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శామీర్‌పేటలో ఎల్లంగౌడ్ గ్యాంగ్ చేతిలో వెంకటరెడ్డి గాయపడ్డారు. సిద్ధిపేట కేంద్రంగా నకిలీనోట్లు చెలమణి అవుతున్నాయని, దీనికి ఎల్లంగౌడ్ ప్రధాన సుత్రధారి అని వెంకటరెడ్డి తెలిపారు. శామీర్‌పేట ఘటనలో తప్పనిసరి పరిస్థితుల్లోనే కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకే కాల్పులు జరిపామని వెల్లడించారు. మొదటిగా రఘు, నరేష్‌లను అదుపులోకి తీసుకున్నామని, వారిని విడిపించేందుకు శ్రీకాంత్, ఎల్లంగౌడ్, ముస్తాఫాలు శామీర్‌పేటకు వచ్చారని చెప్పారు. వస్తూనే ముస్తాఫా మాపై దాడి చేశాడని, కానిస్టేబుల్ ఈశ్వరరావును దారుణంగా హత్యచేశారని తెలిపారు. ఎల్లంగౌడ్‌ను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించామని, మేం పోలీసులమని గ్రహించి ఎల్లంగౌడ్, శ్రీకాంత్‌లు అక్కడి నుంచి పరారయ్యారని వివరించారు.