యెమెన్ పయనం ఎటు?
అరబ్ వసంతం మధ్య ఆసియా దేశాల ప్రజలకు హక్కులు ప్రసాదించడానికి బదులు, ఆయా దేశాలలో అంతర్యుద్ధాలకీ, అశాంతికీ దారితీయడం ఒక చారిత్రక విషాదం. ప్రస్తుతం యెమెన్ సంక్షోభాన్ని గమనిస్తే ఇదే భావనకు రాక తప్పదు. అవినీతికీ, రాచరికాలకీ, కుటుంబ పాలనకీ వ్యతిరేకంగా ప్రారంభమైన అలజడిని ఆసరా చేసుకుని ఉగ్రవాదులు తిష్టవేశారని అనిపిస్తుంది. యెమెన్ పరిణామాలు ఇదే చెబుతున్నాయి. అరబ్ ద్వీపకల్పంలోనే పేద దేశమైన యెమెన్ ఇప్పుడు అంతర్యుద్ధం అంచున ఉంది.
1978 నుంచి యెమెన్‌ను పాలిస్తున్న అల్ అబ్దుల్లా సలేహ్ నియంతృత్వానికీ, అవినీతి విధానాలకీ వ్యతిరేకంగా 2011కు ముందే ప్రజలు గళమెత్తారు. ఈ నిరసన ఈజిప్ట్, ట్యునీషియా ఉద్యమాలతో మిన్నంటింది. ఈజిప్ట్ ఆందోళనకారులు పద్దెనిమిది రోజులలో పాలకుడు ముబారక్నూ, ట్యునీషియా నిరసనకారులు నెలలోపున బెన్ అలీనీ గద్దెలు దింపగలిగారు. కానీ ‘ఇది యెమెన్. ఈజిప్ట్, ట్యునీషియా కాదు’ అని సలేహ్ బీరాలు పలికినా 2012లో విపక్షాలతో కుదిరిన ఒప్పందం మేరకు పదవి నుంచి వైదొలిగాడు. సలేహ్ ప్రభుత్వంలో ఉపాధ్యక్షునిగా పని చేసిన అబ్ద్ రుబ్బు మన్సూర్ హాదీ అధ్యక్షుడయ్యాడు. అయితే ఇతడు కూడా సెప్టెంబర్ 21, 2014న రాజీనామా చేశాడు. హుతీ ఉగ్రవాదులు రాజభవనాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఇతడు మొదట ఏడెన్ తరువాత రియాద్ వెళ్లిపోయాడు. ఇతడిని సంక్షుభిత కాలంలో యెమెన్ అధ్యక్షునిగా చాలా దేశాలు గుర్తించాయి.
యెమెన్‌లో హుతీ ఉగ్రవాదులు (జేదీ పోరాట యోధులు, షియా వర్గీయులు, అబ్దుల్ మాలిక్ అల్ హుతీ నాయకత్వంలో పోరాడుతున్నవారు) ఉత్తర యెమెన్ కేంద్రంగా గడచిన రెండు మూడేళ్లలో అనూహ్యమైన విజయాలు సాధించారు. అందులో రాజధాని సనాను అదుపులోకి తెచ్చుకోవడం ఒకటి. తరువాత దేశమంతటా విస్తరించాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. ఇక దక్షిణ యెమెన్ కేంద్రంగా అల్ కాయిదా, హిరాక్ ఉద్యమకారులు విడివిడిగా హుతీతో పోరాడుతూ, సనాపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల రాజధాని సనాలో జరిగిన రెండు ఆత్మాహుతి దాడులు తమ పనేనని ఐఎస్ఐఎస్ ప్రకటించింది. అంటే జాతీయ, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు సమస్యను మరింత జటిలం చేశాయి. అలాగే పొరుగున ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్ మధ్య వైషమ్యం కూడా యెమెన్ మంటలకు ఆజ్యం పోస్తోంది. ఇంకో షియా రాజ్యం తన పొరుగున ఉండరాదన్నదే సౌదీ అరేబియా ఆశయం. మార్చి మాసాంతంలో జరిగిన పరిణామాలతో సౌదీ అరేబియా హుతీ ఉగ్రవాదులపై వైమానిక దాదులకు కూడా పాల్పడింది. ఇక హుతీలు షియా తెగకు చెందిన వారు కాబట్టి ఇరాన్ తన మద్దతును ప్రకటించింది. సౌదీ అరేబియాకు యథాప్రకారం అమెరికా, బ్రిటన్ సాయం అందిస్తున్నాయి. అయితే అమెరికా అల్‌కాయిదా పట్ల తనకు ఉన్న వ్యతిరేకతను దాచు కోకుండా దక్షిణాది నుంచి పోరాడుతున్న ఆ సంస్థ సభ్యుల మీద డ్రోన్లతో దాడులు చేస్తూనే ఉంది.
నియంతృత్వం సరికాదని భావించి, బాధ్యతాయుతమైన ప్రభుత్వం కోసం ఆశపడి వీధులలోకి వచ్చిన యెమెన్ పౌరులకు చివరికి అశాంతే మిగిలింది. అశాంతి నుంచి అశాంతికే పరిస్థితులు నడిపించాయి. సలేహ్ 1999లో మొదటిసారి ఎన్నికలు జరిపాడు. తనే మళ్లీ పాలకుడయ్యాడు. నిజానికి ఏ ప్రతిపక్షానికి పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పరిస్థితులు కల్పించుకున్నాడు. తరువాత రాజ్యాంగం ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే అందుకు ప్రజలు నిరాకరించారు. ఎందుకంటే, ఆ రాజ్యాంగం ప్రకారం సలేహ్ జీవితకాలం దేశ అధ్యక్షుడిగా కొనసాగుతాడు. ఇతడు యెమెన్‌కు ఇచ్చినది ఏమీ లేదు- బహుముఖ సంక్షోభం తప్ప. ఏ సమస్యనీ పరిష్కరించే యత్నం చేయలేదు. అరబ్ దేశాలలో ఒకటైనా ఇక్కడ చమురు కొరత ఏర్పడింది. దేశ ఎగుమతులు 85 శాతం వరకు అదే. ప్రభుత్వ ఆదాయంలో 70 శాతం చమురు మీదే. దీనికి తోడు నీటి కొరత నెలకొంది. పదేళ్లు గడిస్తే రాజధాని సనాలో చుక్క నీరు దొరకని పరిస్థితి ఏర్పడుతుందని అంచనా. ఇలా ఉండగా జనాభా విపరీతంగా పెరిగింది. నిరుద్యోగం, ఆకలీ పెరిగాయి. దీని తోనే అసంతృప్తి ఉద్యమరూపం దాల్చింది. దేశంలో అధికార మార్పిడి అని వార్యమైంది. అయితే ఈ పరిణామాన్ని ఉగ్రవాదం, అంతర్జాతీయ రాజకీయం హైజాక్ చేయడమే విషాదం.