the yield
-
వేరుశనగ దిగుబడి నామమాత్రం
మడకశిర రూరల్: జిల్లాలో వర్షాభావం వల్ల ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వేరుశనగ దిగుబడులు నామమాత్రమేనని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ శ్రీరామమూర్తి తెలిపారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో వేరుశనగ పంట దిగుబడులను జేడీతోపాటు ఏడీలు పరిశీలించారు. అనంతరం స్థానిక ఏడీఏ కార్యాలయంలో జేడీ విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు తీవ్రంగా నష్టపోవడంతో తీవ్రమైన పశుగ్రాసం కొరత ఏర్పడిందన్నారు. ఈ ఏడాది కూడా ఖరీఫ్ సీజన్లో సమయానికి వర్షం రాకపోవడంతో కేవలం 6.50లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగయ్యాయన్నారు. వేరుశనగ పంట పూత, ఊడలుదిగే సమయంలో వర్షం పడకపోవడంతో 5 లక్షల హెక్టార్లలో పూర్తిగా పంట దిగుబడి తగ్గి ందన్నారు. ఎకరాకు రెండు బస్తాలకు మించి దిగుబడి రాదన్నారు. వేరుశనగ పంట సాగు చేయని భూముల్లో ప్రత్యామ్నాయంగా పంటల సాగుకు విత్తన పంపిణీ చేశామన్నారు. నల్లరేగడి భూముల్లో 1.64లక్షల ఎకరాల్లో శనగపప్పు సాగుకు 7వేల క్వింటాళ్ళ విత్తనాలు పంపిణీ చేశామన్నారు. గత సంవత్సరం వేరుశనగ పంట నష్టపోయిన రైతులకు ఇటీవల కేవలం 53 మండలాలకే మాత్రమే వాతావరణ బీమా మంజూరైందన్నారు. మిగిలిన 10 మండలాలకు కూడా బీమా మంజూరు చేయాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. గత సంవత్సరానికి సంబంధించి రూ.643కోట్ల నష్టపరిహారం కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లోకి జమ చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏడాది కూడా 63మండలాల్లో కరువు ఛాయలు అలుముకున్నాయన్నారు. దీనిపై కరువు మండలాలుగా ప్రకటించాలని ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు. జిల్లాలో 12 వ్యవసాయ అధికారులు, 125 ఏఈఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటి భర్తీ కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని తెలిపారు. -
తగ్గుతున్న టమాట ధర
వారంలో కిలో రూ.12 తగ్గిన వైనం తగ్గిన ఎగుమతి.. పెరిగిన దిగుబడి మదనపల్లె: మదనపల్లె టమాట మార్కెట్లో ధర రోజురోజుకూ తగ్గుతోంది. గత నెల కిలో రూ.50 పైన పలికిన టమాటాలు ప్రస్తుతం రూ.20 పలుకుతున్నాయి. గత వారం కిలో రూ.32 పలికిన టమాట ఆదివారం రూ.20కి పడిపోయింది. కాయల ఎగుమతి 50 శాతం వరకూ తగ్గడం, దిగుబడి 70 శాతం పెరగడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. గడిచిన వారం రోజుల్లో ధరలను పరిశీలిస్తే 18న 10 కేజీల బుట్ట ధర మొదటి రకం రూ.320, రెండో రకం రూ.250, మూడో రకం రూ.180 పలికాయి. 19న మొదటి రకం రూ.300, రెండో రకం రూ.245, మూడో రకం రూ.170, 20న రూ.285, రూ.220, రూ.180, 21న రూ.300, రూ.245, రూ.190, 22, 23 తేదీలలో రూ.285, రూ.220, రూ.160 పలికాయి. ఆదివారం మొదటి రకం రూ.205, రెండో రకం రూ.150, మూడో రకం రూ.100 పలికాయి. 18న మార్కెట్కు 285 టన్నుల కాయలు రాగా ఆదివారం 363 టన్నుల కాయలు వచ్చాయి. ప్రస్తుతం మదనపల్లె మార్కెట్ నుంచి విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, హైదరాబాద్, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కుంభకోణం, పాండిచ్చేరి ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. అన్ని చోట్ల పంట దిగుబడి ఉండడంతో వారం రోజులుగా ఎగుమతులు తగ్గాయి. పైగా అనంతపురం, కదిరి, పెద్దమండ్యం, గుంతకల్లు, లక్ష్మీపురం, రాయల్పాడు, శ్రీనివాసపురం, బి.కొత్తకోట, ముదిగుబ్బ, మడకసిర, పులివెందుల, కడప తదితర ప్రాంతాల నుంచి మార్కెట్కు అధిక మొత్తంలో టమాటాలు వస్తున్నాయి. ఈ కారణంగా ధర పతనమవుతోందని వ్యాపారులు చెబుతున్నారు.