ప్రేమతో అక్క...
చిన్నప్పుడు తమ్ముళ్ల చేయి పుచ్చుకుని స్కూలుకి తీసుకువెళ్లారు...
కొద్దిగా పెద్దయ్యాక గరిటె పట్టుకుని వంటలు చేసి రుచులు చూపించారు...
మరి కాస్త పెద్దయ్యాక తమ్ముళ్లకు మార్గదర్శకురాలయ్యారు...
నలభయ్యేళ్లుగా వారి అనుబంధం ముచ్చటగా కొనసాగుతోంది...
ఆ అక్కయ్యపేరు నిర్మల... ఆ తమ్ముళ్లు శ్రీకాంత్, అనిల్...
తమ్ముళ్ల కోసం అక్కయ్య ప్రేమగా చేసి పెట్టే వంటలు
ఈ రాఖీ సందర్భంగా ప్రత్యేకం...
క్యారట్ హల్వా
కావలసినవి:
క్యారట్ తురుము - కప్పు; పాలు - లీటరు; పంచదార - ఒకటిన్నర కప్పులు; జీడిపప్పు పలుకులు - పది; కిస్మిస్ - 10; నెయ్యి - 6 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - టీ స్పూను
తయారీ:
పాలను స్టౌ మీద ఉంచి నాలుగో వంతు వచ్చేవరకు మరిగించి పక్కన ఉంచాలి బాణలిలో టేబుల్ స్పూను నెయ్యి వేసి కరిగాక, క్యారట్ తురుము వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి
మరిగించిన పాలు జత చేసి బాగా ఉడకు పట్టాక, పంచదార వేయాలి
అన్నీ బాగా ఉడుకుపట్టాక ఏలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి
ఒక బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక జీడిపప్పులు, కిస్మిస్ వేసి వేయించి, ఉడికిన క్యారట్ హల్వాలో వేసి దించేయాలి
బాగా చల్లారాక చిన్న చిన్న కప్పులలో వేసి అందించాలి.
చికెన్ ఫ్రై
కావలసినవి:
స్కిన్ లెస్ చికెన్ - అర కేజీ; అల్లంవెల్లుల్లి పేస్ట్ - 2 టీ స్పూన్లు; కారం - టీ స్పూను; నిమ్మరసం - 2 టీ స్పూన్లు; లవంగాలు - 3; ఏలకులు - 2; దాల్చినచెక్క - చిన్న ముక్క; పసుపు - పావు టీ స్పూను; ఉల్లిపాయ పేస్ట్ - అరకప్పు; పుదీనా ఆకులు - గుప్పెడు; ఉప్పు - తగినంత; నూనె - 3 టేబుల్ స్పూన్లు; పచ్చి మిర్చి - 3; పేస్ట్ కోసం... జీడిపప్పులు - 10; గసగసాలు - 2 టీ స్పూన్లు; ధనియాలు - 3 టీ స్పూన్లు; జీలకర్ర - టీస్పూను; పేస్ట్ కోసం పైన చెప్పిన పదార్థాలకు తగినన్ని నీళ్లు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి.
తయారీ:
చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూను కారం, నిమ్మరసం, పసుపు జత చేసి అర గంట సేపు మ్యారినేట్ చేయాలి
మ్యారినేట్ చేసిన చికెన్‌కు తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి
బాణలిలో నూనె వేసి కాగాక లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క వేసి వేయించాలి
టీ స్పూను అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేయించాక అర టీ స్పూను కారం వేసి కలిపి, పుదీనా ఆకులు, ఉల్లిపాయ పేస్ట్ వేసి కలియబెట్టాలి
ఉప్పు జత చేసి మసాలా మిశ్రమం బాగా విడివిడిలాడేవరకు వేయించాలి
రెండు నిమిషాలయ్యాక ఉడికించిన చికెన్ ముక్కలు వేసి కలిపి ఐదు నిమిషాలయ్యాక దింపాలి.
బెండకాయ ఇగురు
కావలసినవి:
బెండకాయలు - అర కిలో; నూనె - 4 టేబుల్ స్పూన్లు; వెల్లుల్లి రేకలు - 4; జీలకర్ర - టీ స్పూను; ఎండు మిర్చి - 6; జీడిపప్పు - పది; ఉప్పు - తగినంత; కొత్తిమీర తరుగు - టీ స్పూను
తయారీ:
ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి
చిన్నచిన్న ముక్కలుగా తరగాలి
బాణలిలో నూనె వేసి కాగాక బెండకాయ ముక్కలు వేసి వేయించి మంట తగ్గించాలి వేరే బాణలిలో నూనె లేకుండా ఎండు మిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రేకలు వేసి వేయించి, చల్లారాక మిక్సీలో వేసి పొడి చేసి పక్కన ఉంచుకోవాలి
బెండకాయ ఇగురు బాగా వేగాక జీడిపప్పులు జత చేసి కొద్దిసేపు వేయించాక ఉప్పు వేసి కలపాలి
బాగా వేగిందనిపించాక, ముందుగా తయారుచేసి ఉంచుకున్న పొడి అందులో వేసి, కలిపి దించే ముందు కొత్తిమీర చల్లాలి.
సేకరణ: వైజయంతి
ఫోటోలు: శివ మల్లాల