లావణ్య కేసులో వాస్తవం అదే..
ఆపదలో ఉన్న వారెవరైనా..ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు
ఆకతాయిలు చేస్తే మాత్రం కఠిన చర్యలు
నేర రహిత విశాఖ నగరమే లక్ష్యం
రౌడీషీటర్లపై కొరడా
రాత్రివేళల్లో గస్తీ పెంచుతాం
స్టేషన్లు అప్‌గ్రేడ్ కావాలి
‘సాక్షి’తో నగర పోలీస్ కమిషనర్
94406 27277 పోలీస్ కమిషనర్ యోగానంద్ ఫోన్ నెంబర్.. నగరంలో శాంతిభద్రతల పరంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా.. ఎటువంటి సమస్య వచ్చినా ఫోన్ చేస్తే స్వయంగా ఆయనే మాట్లాడతారు. వెంటనే స్పందిస్తారు. సమస్య పరిష్కారానికి తక్షణమే సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తారు.. కానీ ఇదే అదనుగా ఆకతాయిలు ఆ నెంబర్‌కు ఫోన్ చేస్తే మాత్రం కాల్ డీటెయిల్స్ ఆధారంగా పట్టుకుని పోలీస్ కోటింగ్ ఇస్తారు.సీపీ యోగానంద్ స్వయంగా చెప్పిన మాటలివి. వీటితోపాటు నగర పోలీసు విభాగంలో చేపట్టనున్న సంస్కరణలు.. తన లక్ష్యాల గురించి ‘సాక్షి’కి వివరించారు.
విశాఖపట్నం: ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీసు సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయడంలో భాగంగా ప్రజలు నేరుగా తనకే ఫోన్ చేయొచ్చని సీపీ చెబుతున్నారు. నేర రహిత విశాఖ నగరమే ప్రస్తుతం తన ముందున్న ఏకైక లక్ష్యమని సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. నాలుగువారాల కిందట సీపీగా బాధ్యతలు చేపట్టిన తాను ఇప్పటికీ పాత ఫైళ్ల బూజు దులిపే పనిలోనే ఉన్నానని వ్యాఖ్యానించారు.
దాదాపు ప్రతి పోలీస్‌స్టేషన్‌లో పరిష్కారం కాని కేసులు వందల్లో ఉన్నాయని, వాటన్నింటినీ క్లియర్ చేసే పనిలో ఉన్నానని చెప్పారు. ఒక్కోసారి రోజుకు 18 గంటలు కేటాయిస్తున్నా రెండు పోలీస్ స్టేషన్ల సమీక్ష కూడా పూర్తవడం లేదన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్ కేసులు పేరుకుపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించిందన్నారు. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకుండా ఎప్పటికప్పుడు కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నామని సీపీ చెప్పారు.
క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌పై దృష్టి
కమిషనరేట్ పరిధిలో నాన్ బెయిలబుల్ కేసుల్లో అరెస్టు కాని నిందితులు వేలాది మంది ఉన్నారని, అలాంటి కేసులపై ముందుగా దృష్టి పెట్టామని తెలిపారు. కొన్నాళ్లుగా ఇక్కడ విచారణలు సరిగ్గా జరగడం లేదని, బాధితులకు సరైన న్యాయం జరగడం లేదన్న ఫిర్యాదులు తన దృష్టికి ఎక్కువగా వచ్చాయని చెప్పారు.
అందుకే క్వాలిటీ ఇన్వెస్టిగేషన్‌కు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ నియంత్రణపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. నగరంలో రాత్రి వేళల్లో గస్తీ పెంచుతామని చెప్పారు. నగరంలోని రౌడీషీటర్ల కదలికలపై ఇప్పటికే ఆరా తీస్తున్నామన్నారు. భూ కబ్జాలు. ఆయిల్ మాఫియా, డ్రగ్ మాఫియా, స్మగ్లింగ్, అసాంఘిక కార్యకలాపాల వెనుక రౌడీషీటర్ల పాత్ర ఎక్కువగా ఉంటోందన్నారు. అందుకే త్వరలో పేరుమోసిన రౌడీషీటర్ల పనిపడతామని ఆయన వ్యాఖ్యానించారు.
అదనపు సిబ్బంది కావాలి
కమిషనరేట్ పరిధిలో పోలీసు సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని సీపీ తెలిపారు. ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా 600 మంది పోలీసు సిబ్బంది నియమాక ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. అందులో 350 మంది నుంచి 400 మంది వరకు ఉద్యోగులను విశాఖ కమిషనరేట్‌కు కేటాయించవచ్చని తాను భావిస్తున్నానని చెప్పారు.
స్టేషన్లు అప్‌గ్రేడ్ కావాలి
ఇప్పటికీ కమినరేట్ పరిధిలోని స్టేషన్లన్నీ సీ గ్రేడ్ స్థాయిలో ఉన్నాయని సీపీ యోగానంద్ వివరించారు. విభజన తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా విశాఖ నగరంలోని పోలీసు స్టేషన్లు అప్‌గ్రేడ్ కావాలన్నారు. పీఎస్‌లను ఏ, బీ గ్రేడ్‌కు మార్చాలని సిఫార్సులు పంపిస్తామని సీపీ చెప్పారు.
లావణ్య కేసులో వాస్తవం అదే..
కలకలం సృష్టించిన గాజువాకకు చెందిన లావణ్య మృతి కేసు విచారణలో పోలీసులు విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ వాస్తవంగా జరిగింది యాక్సిడెంటే.. కొన్ని వందల మందిని విచారించాం.. కేసు విచారణను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నేను వ్యక్తిగతంగా విచారణ చేపట్టా,.. హత్య కాదు అని నిర్ధారణ అయిన తర్వాతే నేను ధైర్యంగా మీడియా ముందుకొచ్చి చెప్పాను.
కానీ అప్పటికే గోబెల్స్ ప్రచారం జనంలోకి వెళ్లిపోయింది.. నేను గతంలో సైబరాబాద్‌లో పనిచేసినప్పుడు కూడా ఓ యువతి ఆత్మహత్య కేసులో సరిగ్గా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నా.. హత్య చేశారని ప్రచారం జరిగింది. విచారణలో చివరికి ఆత్మహత్యని తేలింది. ఈ కేసులో కూడా అంతే.. అది పక్కాగా యాక్సిడెంటే.