Yoghurt
-
హిజాబ్ ధరించలేదని యువతులపై పెరుగుతో దాడి.. వీడియో వైరల్
ఇరాన్లో హిజాబ్ వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. హిజాబ్ విషయంలో ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ దేశ మహిళలు, యువతులు పోరాటం చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఆందోళనకారులను అణిచివేసేందుకు ఇరాన్ ప్రభుత్వం సైతం తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తాజాగా హిజాబ్ సరిగా ధరించలేదనే కారణంతో ఓ వ్యక్తి ఇద్దరు యువతులపై అనుచితంగా ప్రవర్తించాడు. బహిరంగ ప్రదేశాల్లో తమ జుట్టును హిజాబ్‌తో కప్పి ఉంచనందుకు ఇద్దరు మహిళలపై పెరుగుతో దాడి చేశాడు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఇద్దరు యువతులు హిజాబ్ పూర్తిగా ధరించకుండా కిరాణ షాప్‌లోకి వెళ్లారు. వాళ్లను ఫాలో అవుతూ అక్కడికి వచ్చిన ఓవ్యక్తి ఇద్దరితో కొద్దిసేపు ఆగ్రహంగా మాట్లాడాడు. ఎందుకు హిజాబ్ ధరించలేదంటూ వాగ్వాదానికి దిగాడు. వెంటనే కోపంలో దుకాణంలో ఉన్న పెరుగును తీసి ఇద్దరి తలలపై విసిరేశాడు. ఊహించని పరిణామంతో ఇద్దరు యువతులు అలాగే ఉండిపోయారు. దీంతో షాప్ యజమాని బయటకు వచ్చి దాడి చేసిన వ్యక్తిని చితకబాదాడు. చివరికి ఈ ఘటన పోలీసుల వరకు చేరింది. బహిరంగ ప్రదేశాల్లో నిబంధనలు అతిక్రమించి ప్రవర్తించినందుకు సదరు వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులుతెలిపారు. అతనితోపాటు ఇద్దరు యువతులను కూడా అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. హిజాబ్ నిబంధనలను ఉల్లంఘించి ప్రవర్తించినందుకు అదుపులోకి తీసుకుంటున్న చెప్పారు. ఇదిలా ఉండగా ఇరాన్ అధికారిక చట్టం ప్రకారం ఏడు సంవత్సరాల పై వయసున్న బాలికలు, మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలనే నిబంధనలు ఉన్నాయి. مشهد، شاندیز از صفحه یاسر عرب pic.twitter.com/zstrtACMQD — Mehdi Nakhl Ahmadi (مهدی نخل احمدی) (@MehdiNakhl) March 31, 2023 -
పెరుగుతో అధిక రక్తపోటు దూరం
రోజుకో యాపిల్ తింటే డాక్టర్ల అవసరమే రాదన్నట్లు.. రోజుకో పెరుగుకప్పు తింటే.. రక్తపోటు దూరం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. నెలకోసారి పెరుగు తినేవారి కంటే వారానికి ఐదారు కప్పుల పెరుగు తినేవారిలో రక్తపోటు ప్రమాదం 20 శాతం తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. గుండెజబ్బులు, స్ట్రోక్స్ వంటి ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పే అధికరక్తపోటును పెరుగు నియంత్రిస్తుందని అధ్యయనాల్లో తెలుసుకున్నట్లు అమెరికా బోస్టన్ విశ్వవిద్యాలయంలో డాక్టొరల్ విద్యార్థి, ప్రధాన పరిశోధకుడు జస్టిన్ బ్యూండియా చెప్తున్నారు. పాలు... పాలతో తయారయ్యే జున్ను వంటి పదార్థాలు కూడా ప్రతిరోజూ తీసుకోవడం మేలని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు. ఇతర పాల ఉత్పత్తులకంటే పెరుగు అత్యధికంగా ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. మధ్యవయసువారిలో రక్తపోటుపై పెరుగు ప్రభావం కనుగొనేందుకు 25-55 మధ్య వయసున్న మహిళలపై అధ్యయనాలు నిర్వహించారు. అలాగే 40-75 మధ్య పురుషుల ఆరోగ్య పరిస్థితులనూ పరిశీలించారు. అధిక మొత్తంలో పెరుగు తీసుకునేవారు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేవారి మధ్య ప్రభావాలు భిన్నంగా ఉన్నట్లు పరిశోధకులు గమనించారు. పండ్లు, కూరగాయలు, గింజలు, బీన్స్ వంటి ఆహారం తీసుకునే వారిని, వారంలో ఐదారుసార్లు పెరుగు తినేవారిని పోల్చి చూసినా... పెరుగు లేదా పాల ఉత్పత్తులు తీసుకునేవారే బలంగా ఉండటంతోపాటు, రక్తపోటు ప్రమాదం తక్కువగా ఉన్నట్లు అధ్యయాల్లో తేలిందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కు చెందిన ఎపిడమియాలజీ, లైఫ్ స్టైల్ 2016 సైంటిఫిక్ సెషన్స్ లో ప్రచురించారు. పాలలో రెండు చెంచాల పెరుగు కలిపి గది ఉష్ణోగ్రతలోనే సహజపద్ధతిలో పెరుగు తయారు చేస్తారు. యోగర్ట్ కూడా పాల ఉత్పత్తే అయినా కొంత కృత్రిమంగా తయారవుతుంది. రెండింటిలో ఏ రూపంగా తీసుకున్నా ఇది మహిళల్లో రక్తపోటును నియంత్రిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.