హైడ్రామా
జమ్మలమడుగు: మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక విషయంలో జమ్మలమడుగులో రెండో రోజూ హైడ్రామా నడిచింది. రాత్రి 11 గంటల వరకు ఎన్నిక విషయంలో అధికారులు ఎటూ తేల్చలేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చిన తరువాతే ఎన్నికను నిర్వహిస్తామని 11గంటల తరువాత ఆర్డీఓ ప్రకటించి వెళ్లిపోయారు. శుక్రవారమే ఎన్నికను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల అధికారులు సూచించినా ప్రిసైడింగ్ అధికారి రఘునాథరెడ్డి తనకు ఆరోగ్యం సరిగా లేదంటూ డ్రామాకు తెరలేపారు. ఆయన ఆరోగ్యం సరిగానే ఉందంటూ వైద్యులు తేల్చిచెప్పారు. మరోవైపు రెండో రోజుకూడా తెలుగుతమ్ముళ్లు స్వైర విహారం చేశారు. రాళ్లు రువ్వడంతో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. దాదాపు గంటసేపు టీడీపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది.
ఒకటో వార్డు కౌన్సిలర్ అయిన తన కుమారుడు ముల్లా జానీ కిడ్నాప్ అయినట్లు ఆయన తల్లి నూర్జహాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన తర్వాతే చైర్మన్ ఎన్నికను నిర్వహిస్తామని ప్రిసైడింగ్ అధికారి రఘునాథరెడ్డి పేర్కొన్నారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో వైద్యం చేయించుకోవడానికి వెళ్లాలని ముండ్లజానీ ఆర్డీఓకు ఫ్యాక్స్ ద్వారా తెలిపారు. అంతేగాక గోవాలోని పనాజీ కోర్టుకు హాజరై తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని వాంగ్మూలం ఇచ్చాడు. వివిధ టీవీ ఛానల్స్‌తో కూడా మాట్లాడారు.
దీనిని అధారంగా చేసుకుని పోలీసులు నివేదిక తయారు చేసి ఆర్డీఓకు సమర్పించారు. దీనిపై ప్రిసైడింగ్ అధికారి సరైన నిర్ణయం తీసుకోలేదు. కోరం ఉన్నా ఎన్నికను వాయిదా వేయడం సరికాదని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కార్యాలయంలోనే ధర్నా నిర్వహించారు. తొలుత కౌన్సిల్ సమావేశానికి ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించిన ఆర్డీఓ జి.రఘునాథరెడ్డి హజరుకాగానే అధికారులు వచ్చిన కౌన్సిలర్, ఎమ్మెల్యే, ఎంపీలతో సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారు.
వైఎస్సార్సీపీకి చెందిన వారు సంతకాలు చేసిన తర్వాత టీడీపీ సభ్యులతో సంతకాల కార్యక్రమం చేపట్టగా తాము దొంగ సంతకాలు చేయమని తమ కౌన్సిలర్ ముల్లా జానీ తమ ముందుకు వచ్చిన తర్వాతనే సమావేశాన్ని నిర్వహించాలని గొడవకు దిగారు. 20 వార్డు కౌన్సిలర్ అయిన నూర్జహాన్ కౌన్సిల్ సమావేశం హాలులోనికి కారం పోడిపొట్లం తెచ్చి ఎంపీ వైఎస్ ఆవినాష్రెడ్డిపై చల్లే ప్రయత్నం చేశారు. కారం పొడి ఎంపీ చొక్కా, టేబుల్‌పై పడింది.