‘పైడికాల్వ’కు ఆరువికెట్లు
కడప స్పోర్ట్స్, న్యూస్‌లైన్: మహారాష్ట్ర బ్యాట్స్‌మన్ మెరుపులు మెరిపించడంతో ఆంధ్రా జట్టుపై 123 పరుగుల ఆధిక్యం సాధించారు. కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో మూడో రోజు 196 పరుగుల ఓవర్‌నైట్‌తో బరిలోకి దిగిన మహారాష్ట్ర బ్యాట్స్మన్లు శనివారం మ్యాచ్‌లో 128 ఓవర్లలో 440 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. 97 పరుగులతో ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్‌గా బరిలోకి దిగిన స్టార్బ్యాట్స్మన్ కేదార్‌జాదవ్ 13 ఫోర్లు 2 సిక్సర్లతో చెలరేగి 173 పరుగులు చేసి కడప క్రీడాకారుడు పైడికాల్వ విజయ్‌కుమార్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. మరో బ్యాట్స్‌మన్ బావ్నే 6 ఫోర్లతో 54 పరుగులు సాధించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర జట్టు కెప్టెన్ రోహిత్ మొత్వాని 13 ఫోర్లతో 95 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచా డు. ఆంధ్రా బౌలర్ పైడికాల్వ విజయ్‌కుమార్ ప్రదర్శన ఒక్కటే ఆంధ్రాజట్టుకు ఊరటనిచ్చే అంశం. ఈయన కీలకమైన 6 వికెట్లను తీసి మహారాష్ట్ర మరింత భారీస్కోరు చేయకుండా అడ్డుకోగలిగాడు.
ఈయనతో పాటు హరీష్ 2 వికెట్లు, స్టెఫెన్, సురేష్ చెరో వికెట్ తీశారు. అనంతరం రెండో ఇన్సింగ్స్ ప్రారంభించిన ఆంధ్రా జట్టు ఓపనర్ డి.బి.ప్రశాంత్ వికెట్ కోల్పోయి 27 పరుగులు సాధించింది. జట్టులోని కె.ఎస్.భరత్ 14, చిరంజీవి 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. చివరి రోజు మ్యాచ్ ఆద్యంతం ఆంధ్రా జట్టు ఆటగాళ్లు ఆడితే తప్ప పరాజయం నుంచి తప్పించుకునే అవకాశం లేదు. లేనిపక్షంలో ఇప్పటికే తొలిఇన్నింగ్స్ ఆధిక్యంలో ఉన్న మహారాష్ట్రను విజయం వరించే అవకాశం ఉంది.
ప్రేక్షకుల సందడి..
మ్యాచ్‌ను వీక్షించడానికి మాంట్‌ఫోర్డ్ పాఠశాల విద్యార్థులతో పాటు పలువురు అభిమానులు స్టేడియంలో సందడి చేశారు. లోకల్‌బాయ్ విజయ్‌కుమార్‌తో ఫొటోలు దిగేందుకు, ఆటోగ్రాఫ్‌లకు ఎగబడ్డారు. మ్యాచ్‌ను వీక్షించిన వారిలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు, ఉపాధ్యక్షుడు జానకీనాథరెడ్డి, ఏఓ త్రినాథ్‌రెడ్డి, సం యుక్త కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, సభ్యులు శివప్రసాద్, ఖాజా, అన్సర్, నాసిర్, రెహమాన్, సంజయ్‌రెడ్డి ఉన్నారు.