పొంగులేటికి తెలంగాణ సారథ్యం
ఖమ్మం: ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సారథ్య బాధ్యతలు అప్పగిస్తూ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన పొంగులేటిని పూర్తి స్థాయి అధ్యక్షులుగా నియమించారు. మరో 47 మందితో రాష్ట్ర, అనుబంధ సంఘాల కమిటీలను శుక్రవారం ప్రకటించారు. ఈ కమిటీలో జిల్లాకు ప్రాధాన్యం లభించింది.
ప్రధాన కార్యదర్శులుగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పార్టీ సత్తుపల్లి నియోజకవర్గ ఇన్చార్జి మట్టా దయానంద్ విజయ్‌కుమార్ నియమితులయ్యారు. అలాగే కార్యదర్శిగా ఐలూరి వెంకటేశ్వరరెడ్డి, సంయుక్త కార్యదర్శిగా షర్మిలా సంపత్, అధికార ప్రతినిధిగా ఆకుల మూర్తి, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా జూపల్లి రమేష్, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా మొండెం జయరాజు, క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా వీఎల్ఎన్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పొంగులేటితో సహా జిల్లా నేతలకు కూడా రాష్ట్రస్థాయి ప్రధాన బాధ్యతలు అప్పగించారు.
నారాయణపురం నుంచి అంచెలంచెలుగా..
పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వస్థలం కల్లూరు మండలం నారాయణపురం గ్రామం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి, ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డిపై ఉన్న అభిమానంతో 2013 ఫిబ్రవరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత అదే ఏడాది ఏప్రిల్ 20 నుంచి మే 12 వరకు జిల్లాలో జరిగిన జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర బాధ్యతలను భుజానికెత్తుకుని విజయవంతం చేశారు.
గతంలో వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, వాటిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా నిర్వీర్యం చేసిందో ప్రచారం చేస్తూ ఆయన జిల్లాలో క్షేత్రస్థాయి నుంచి పార్టీకి పునాదులు వేశారు.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇటు షర్మిల, అటు విజయమ్మ, జగన్ మోహన్‌రెడ్డి పర్యటనలతో జిల్లాలో పార్టీకి కొత్త ఊపును తెచ్చారు. ఎన్నికల్లో పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఖమ్మం నుంచి పోటీ చేసి విజయం సాధించడమే కాక జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలను గెలుచుకునేలా పకడ్బందీ వ్యూహాలను రూపొందించి జిల్లాలో పార్టీకి దిశా నిర్దేశం చేశారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంలో కీలక భూమిక పోషించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి పొంగులేటి చేస్తున్న కృషికి ఫలితంగా పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఆయనకు ఇటీవలే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అప్పగించడంతో పార్టీ శ్రేణులు శ్రీనివాసరెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశాయి.