మీ ఇంట్లో వారికి జరిగితే.. అలాగే చేస్తారా?
వైటీచెరువు ఘటన సమయంలో సహాయక చర్యలపై కలెక్టర్ అసంతృప్తి
అనుమతి లేకుండా జిల్లా దాటితే చర్యలు తప్పవని అధికారులకు వార్నింగ్
అనంతపురం సెంట్రల్ :
‘గుంతకల్లు మండలం వైటీచెరువులో తెప్ప ప్రమాదం గురించి తెలిసిన వెంటనే విజయవాడ నుంచి రోడ్డుమార్గం గుండా హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చా. వీవీఐపీలు కూడా చేరుకున్నారు. కానీ జిల్లా అధికారులు మాత్రం అందుబాటులో లేరు. ఇక నుంచి నా అనుమతి లేకుండా జిల్లా దాటిపోయారంటే చర్యలు తప్పవు’ అని కలెక్టర్ వీరపాండియన్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో జిల్లా ఉన్నతాధికారులతోను, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలస్థాయి అధికారులతోను కలెక్టర్ మాట్లాడారు. వైటీచెరువు ప్రమాదం తర్వాత మృతదేహాలను ట్రాక్టర్ ట్రాలీలో తరలించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘మీ కుటుంబీకులకు జరిగితే ఇలాగే వ్యవహరిస్తారా? మృతదేహాలను కుప్పగా పోసి తీసుకెళ్లడమేంటి’ అని ప్రశ్నించారు. వాహనాలను సమకూర్చాల్సిన రోడ్డు, రవాణాశాఖ అధికారులు పత్తా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపరవాణా కమిషనర్ సెలవులో ఉంటే ఇన్చార్జ్గా వ్యవహరించాల్సిన అధికారులు పట్టించుకోలేదన్నారు. జీవించి ఉన్నప్పుడే కాదు.. చనిపోయిన తర్వాత కూడా జనం బాగోగులు చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని స్పష్టం చేశారు. ఇక నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ ప్రతి ఒక్కరూ తన అనుమతి లేనిదే సెలవుపై వెళ్లడానికి వీల్లేదన్నారు. ‘జిల్లా యంత్రాంగం ఫెయిల్యూర్’ అనే పదం వినిపించకూడదన్నారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించడంలో వైద్య, ఆరోగ్యశాఖ, పోలీసు అధికారులు బాగా పనిచేశారని అభినందించారు.
ప్రజల్లో నమ్మకం కలిగించేలా పనిచేయాలి
అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన అర్జీల పరిష్కారంపై కలెక్టర్ సమీక్షించారు. వందకు పైగా అర్జీలు పెండింగ్ ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్ అర్జీల వివరాలు తెలియవని కొంతమంది అధికారులు చెప్పడంతో.. ‘మీపై నమ్మకం లేకపోవడంతోనే సీఎం కార్యాలయం వెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన అర్జీలే పరిష్కరించకపోతే మిగిలినవి ఏ విధంగా పరిష్కరిస్తారో అర్థమవుతోంద’ని అన్నారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను వెంటనే పరిష్కరించాలని, ప్రజల్లో నమ్మకం కలిగించేలా పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్‌కలెక్టర్ –2 సయ్యద్ ఖాజామొహిద్దీన్, ఇన్చార్జ్ డీఆర్వో రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.