ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధంకండి
– మార్చి 6న విజయవాడలో యుద్దభేరి దీక్షలు
కర్నూలు(అర్బన్):
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే అంశంపై ప్రభుత్వం యుద్ధానికి చేసేందుకు సిద్ధం కావాలని వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం. సుభాష్ చంద్రబోస్ పిలుపునిచ్చారు. మార్చి 6వ తేదీన విజయవాడలో చేపట్టనున్న వాల్మీకుల యుద్ధ భేరి దీక్షలను విజయవంతం చేయాలని కోరుతు జిల్లాలో వీఆర్పీఎస్ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం కల్లూరు మండలం పెద్దటేకూరు గ్రామంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో సుభాష్ మాట్లాడుతూ 2016 మార్చి 5వ తేదీన జరిగిన బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ నరసింహన్ వాల్మీకి, బోయలను ఎస్టీలుగా గుర్తించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫారసు చేస్తామని ప్రకటించి ఏడాది పూర్తయినా చర్యలు లేవన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేయాలనే డిమాండ్‌పై విజయవాడలోని అలంకార్ సర్కిల్ వద్ద వాల్మీకుల యుద్దభేరి దీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. న్యాయమైన డిమాండ్ సాథన కోసం రాజకీయాలకు అతీతంగా వాల్మీకులు కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్పీఎస్ జిల్లా నాయకులు శ్రీనివాసులు, మల్లేష్, లోకేష్, గణేష్, ప్రకాష్, మద్దయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.