ఒబామానే మెప్పించాడు!
విజయం
అద్భుతాలు సృష్టించడానికి వయసుతో పని లేదు. ఆ విషయం యూసుఫ్ బాతాని చూస్తే తెలుస్తుంది. పుట్టుకతోనే బధిరుడైన ఈ చిన్నారి చదువులో అందరినీ తోసిరాజన్నాడు. అమెరికా అధ్యక్షుడు ఒబామాతోనే శభాష్ అనిపించుకున్నాడు.
కేరళలోని కోజికోడ్‌కు చెందిన యాకూబ్ బాతా... ఉద్యోగ నిమిత్తం భార్యతో సహా అబుదబీ వెళ్లి స్థిరపడ్డారు. అక్కడ వారికి యూసుఫ్ జన్మించాడు. వంశోద్ధారకుడు పుట్టాడన్న వారి ఆనందం మీద... యూసుఫ్ లోని వినికిడి లోపం నీళ్లు చల్లింది. పిల్లాడు వినలేడని తెలుసుకున్న ఆ దంపతులు కుమిలిపోయారు. అయినా అతడికి జీవితంలో ఉన్నత స్థితికి చేరేలా పెంచాలన్న ఉద్దేశంతో... అందుకు సాయం చేసే సంస్థ కోసం వెతికారు. అమెరికాలోని ‘సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద డెఫ్’ వారి ఆశను నెరవేర్చింది. యూసుఫ్ బాధ్యతను తీసుకుంది.
ఆ సంస్థ ద్వారా అక్షరాలు దిద్దిన యూసుఫ్... చూస్తూండ గానే ఎవరూ అందుకోలేని స్థాయికి చేరుకున్నాడు. చదువులో అద్భుతమైన ప్రతిభను కనబరచి ఇటీవలే ‘ఔట్‌స్టాండింగ్ అకడమిక్ అచీవ్మెంట్ అవార్డు’ను అందుకున్నాడు. అతడి ప్రతిభ గురించి తెలుసుకున్న ఒబామా ప్రశంసలు కురిపిస్తూ స్వయంగా యూసుఫ్‌కి ఉత్తరం రాశారు. జీవితంలో ఇంకా ఇంకా ఎదగాలని ఆశీర్వదించారు.